నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ మండలం, రహత్‌నగర్ గ్రామంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ అనే మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్‌గల్ పట్టణానికి చెందిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన బస్ బడి పిల్లలను తీసుకురావడానికి రహత్‌నగర్ గ్రామానికి వెళ్ళింది. ఒక బాలుడి తల్లి శిరీష తన పెద్ద కుమారుడిని స్కూల్ బస్సులో ఎక్కిస్తోంది.. ఆ సమయంలో చిన్నారి శ్రీకాంత్ బస్ ముందు ఆడుకుంటూ ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు నడపడంతో బస్సు బాలుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తలకి త్రీవ గాయాలై ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించాడు.
విషయం తెలుసుకున్న సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.సందీప్ తెలిపారు. కాగా, స్కూల్ డ్రైవర్ నిర్లక్ష్యంతో చనిపోయిన బాలుడి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బంధువులు బైఠాయించారు. దీంతో స్కూల్ యాజమాన్యం ప్రాణంతో ఖరీదు కట్టినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్ ముందు బాలుడి మృతదేహం కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుండడంతో కొందరు మధ్యవర్తులు జోక్యం చేసుకున్నారు. పసివాడి ప్రాణం ఖరీదుకు పాఠశాల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, రూ.9 లక్షలు చెల్లించేందుకు బాధిత కుటుంబ సభ్యులను ఒప్పించినట్టు తెలుస్తోంది.