పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఆమె నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘థామా’. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో వస్తున్న ఐదో చిత్రం ఇది. ఇప్పటివరకూ ఈ యూనివర్స్‌లో ‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’, ‘స్త్రీ-2’ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల తర్వాత వస్తున్న చిత్రం థామా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందనే వచ్చింది.
అంతేకాక.. సినిమా నుంచి వచ్చిన వీడియో సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులో రష్మిక చేసిన పాట ఒకటి కాగా, ‘దిల్‌బర్’ అంటూ సాగే పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి చిందులు వేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘పాయిజన్ బేబి’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఇందులో 51 ఏళ్ల వయస్సులోనూ తన అందంతో కుర్రకారును కుదిపేస్తున్న మలైకా ఆరోరా స్టెప్పులు వేసింది. ఇది కూడా పార్టీ సాంగ్‌లానే కనిపిస్తోంది. చివర్లో మలైకాతో పాటు రష్మిక కూడా డ్యాన్స్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాను ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించగా.. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 21వ తేదీన థామా విడుదల కానుంది.