సిడ్నీ: టీం ఇండియా త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టి-20ల్లో తలపడుతోంది. చాలాకాలం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. దీంతో ఈ సిరీస్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కీలక సిరీస్ భాగంగా జరిగే తొలి వన్డేకి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. అక్టోబర్ 19వ తేదీన పెర్త్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కి జట్టు కీలక ఆటగాళ్లు ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వనుండడంతో స్పిన్నర్ జంపా న్యూ సౌత్ వేల్స్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడంట.
రెండో, మూడో వన్డేల్లో మళ్లీ అతడు జట్టుతో జతకట్టే అవకాశం ఉ:ది. ఇక కాలి గాయం కారణంగా ఇంగ్లిస్ కాలి కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఆడే అవకాశాలు లేవు. వీరిద్దరి స్థానంలో మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్‌లను ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఫిలిప్ ఆసీస్ తరపున వన్డే అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా మొదటి ఛాయిస్ అయితే అలెక్స్ క్యారి. కానీ, క్యారీ త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్‌లో పాల్గొనాలి. అందుకే అతన్ని తప్పించారు.