పొరుగు దేశం పాకిస్తాన్ ఇంటాబయటా పెను సమస్యలతో సతమతమవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోసి, ఆ మంటల్లో చలికాచుకుందామనుకున్న దాయాదిని ఇప్పుడవే మంటలు చుట్టుముట్టి, ఊపిరి సలపనివ్వడం లేదు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, దేశాన్ని ఎలా గట్టెక్కించాలో తెలియక పాక్ పాలకులు సతమతమవుతుంటే, ఉగ్రవాదం పెనుభూతమై కోరలు సాచి కబళించబూనడంతో దిక్కుతోచడం లేదు. గాజాలో పెచ్చుమీరుతున్న మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ వారం రోజుల క్రితం ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటైన తెహ్రీక్ -ఇ-లబ్బైక్ పాకిస్తాన్ కార్యకర్తలు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ వంటి ముఖ్య నగరాల్లో చేసిన ఆందోళనలు ఆ దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంతగా క్షీణించిందో కళ్లకుకట్టాయి.
ఆ అల్లర్లను అణచివేశామన్న సంతృప్తి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఒక్క రోజైనా మిగలకుండానే అఫ్గానిస్తాన్‌తో ఘర్షణలు పెచ్చుమీరాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఊపిరులూది, ఇండియాపైకి ఎగదోసి వినోదం చూద్దామనుకున్న దాయాది దేశానికి తెహ్రీక్-ఇతాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) సీమాంతర ఉగ్రవాదం ఎలా ఉంటుందో రుచి చూపిస్తోంది. అఫ్గాన్ గడ్డపైనుంచి పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ పాక్ ప్రభుత్వానికి కంటిమీద నిద్ర లేకుండా చేస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఇటీవల జరిపిన దాడుల్లో సైనిక నష్టం జరగడంతో పాక్ భగ్గుమంది. టిటిపి ప్రధాన నేతలను మట్టుబెట్టే ఉద్దేశంతో కాబూల్ పై బాంబు దాడులకు తెగబడటంతో తాలిబాన్ ప్రభుత్వం ఎదురు దాడులు ప్రారంభించింది.
ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్, ఆపరేషన్ సిందూర్ ను తప్పుబట్టిన పాకిస్తాన్‌కు సీమాంతర ఉగ్రవాదం ఎంతటి ప్రమాద హేతువో ఇప్పుడు అర్థమవుతున్నట్లుంది. వాస్తవానికి అఫ్గానిస్తాన్ -పాకిస్తాన్ మధ్య సంబంధ బాంధవ్యాలు మొదటినుంచీ అంతంతమాత్రమే. ఇరుదేశాలనూ విభజిస్తున్న డ్యురాండ్ రేఖను తాము గుర్తించబోమంటూ అఫ్గాన్ మొదటినుంచీ తెగేసి చెబుతూ వస్తోంది. తాలిబాన్ల చేతికి పగ్గాలు వచ్చాక ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. దీనికి ప్రధాన కారణం తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ సంస్థే. 2007లో ఏర్పడిన ఈ సంస్థ షియా వ్యతిరేక ఉద్యమాన్ని నెత్తికెత్తుకుని, ఆత్మాహుతి బాంబుదాడులకు పాల్పడటంతో అనతికాలంలోనే నిషేధానికి గురైంది. అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఆక్రమణలకు మద్దతు పలికిందన్న కారణంగా పాకిస్తాన్ పై టిటిపి కక్ష గట్టింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు టిటిపిని దారికి తెచ్చేందుకు తాలిబాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కానీ, ఏ ఒప్పందమూ కుదరకముందే ఆయన జైలుపాలయ్యారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన ప్రధాని షెహబాజ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడమే లక్ష్యంగా టిటిపి మరింతగా పేట్రేగిపోతోంది.
గత ఎనిమిది నెలల్లో టిటిపి 2414 మంది పాక్ పౌరులను హతమార్చినట్లు పాకిస్తాన్‌కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ సంస్థ అధ్యయనంలో తేలింది. తాజాగా టిటిపి పాక్ సైనికులను లక్ష్యం చేసుకోవడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అఫ్గాన్-, పాక్ రాజకీయ సంక్షోభంపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించినా, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఆశిస్తున్న చైనా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడనే విధంగా పాక్ తో వైరం అఫ్గానిస్తాన్‌ను భారత్‌కు దగ్గర చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్నప్పుడే పాక్- అఫ్గాన్‌ల మధ్య ఘర్షణలు తలెత్తడం కాకతాళీయమే అయినా, భారత్ కు ఈ పరిణామం కలిసివచ్చే అంశమే. ఇరుగుపొరుగు దేశాలతో భారత్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో అఫ్గాన్ దగ్గర కావడం ఒకింత హర్షించదగిన పరిణామం. అఫ్గాన్‌లో తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించకపోయినా, పూర్తిగా ఆ దేశంతో దౌత్య సంబంధాలను తెంచుకోలేదు.
తాజాగా అఫ్గాన్ విదేశాంగ మంత్రి పర్యటనతో సంబంధాలు మళ్లీ బలోపేతం కానున్నాయి. కాబూల్‌లో నాలుగేళ్ల క్రితం మూసివేసిన దౌత్య కార్యాలయాన్ని మళ్లీ తెరిచేందుకు భారత్ అంగీకరించడం ఒక శుభపరిణామం. అఫ్గానిస్తాన్ పునర్ నిర్మాణంలో భారత్ ఇప్పటికీ తన వంతు పాత్ర పోషిస్తోంది. తాజా బడ్జెట్ లోనూ 25 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్‌ను కట్టడి చేసేందుకు అఫ్గాన్‌తో స్నేహం వెదకబోయిన తీగ కాలికి తగిలిన చందంగా ఉపయోగపడుతుందని ఆశిద్దాం.