పర్వదినాలను ప్రజలు సంబరంగా జరుపుకోవడానికి ప్రభుత్వాలు సకల ఏర్పాట్లు చేయాలి. సదుపాయాల కల్పనే ప్రభుత్వ సామర్థ్యానికి రికార్డులు కావాలి. తెలంగాణలో మహిళలు ఘనంగా జరుపుకొనేది బతుకమ్మ పండుగ. పేద మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ 2024 లో చేయలేదు. ఈ పండుగకు ఇస్తామన్న మాట కూడా దాటి పోయింది. తమ పేరు కోసం మాత్రం తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను మరో రకంగా ఘనంగా జరిపింది. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా ప్రభుత్వం సెప్టెంబర్ 29న హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో భారీ బతుకమ్మ ఏర్పాటు చేసింది. వాటిని పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు రెండు ప్రపంచ రికార్డులను నిర్వాహకులకు అందజేశారు.
63 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన తెలంగాణ మహాబతుకమ్మకు ఒక రికార్డు, బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు తిరుగుతూ ఆడి పాడినందుకు మరో రికార్డు లభించాయి. ఈ రికార్డు పత్రాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, మేయర్ విజయలక్ష్మిలు అందుకున్నారు. అదే రోజు మంత్రి జూపల్లి అధికారులతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసి రెండు రికార్డులను ముఖ్యమంత్రికి అందజేశారు. వాటిని సాధించేందుకు అన్ని విధాలా సహకరించిన సిఎంకు మంత్రి, ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మను గిన్నిస్ బుక్‌తో ముడిపెట్టడం గత ప్రభుత్వంతోనే మొదలైంది. 2016 లో ఎల్‌బి స్టేడియంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళల సంఖ్య ఆధారంగా అప్పుడు గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది. అప్పుడు, ఇప్పుడు కేరళలోని ఓనం పండుగ సాధించిన రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో ఈ ఏర్పాటు జరిగాయి. ఓనం సందర్భంగా 2023 లో కేరళలోని త్రిసూరులో 7027 మంది స్త్రీలు సాంప్రదాయిక తిరువాతిర నృత్యంలో పాల్గొని రికార్డు సాధించారు.
దీని నిర్వహణ కేరళ ప్రభుత్వం కాకుండా ఒక మహిళా స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. 9 వేల మంది స్త్రీలను స్టేడియంకి రప్పించి ఆ రికార్డును తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తిరగ రాసింది. లండన్ కేంద్రంగా ఉన్న గిన్నిస్ సంస్థ ఈ సంవత్సరమంతా అందజేసిన కొత్త ప్రపంచ రికార్డులను జోడించి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ – 2026’ పుస్తకాన్ని తెస్తుంది. ఈ పుస్తకం కాపీలు ఏడాదికి 35 లక్షల దాకా అమ్ముడవుతున్నాయి. ప్రపంచంలోని 40 భాషల్లో ఇది లభిస్తుంది. ఇంగ్లీషు ప్రతి ధర రూ. 3 వేల దాకా ఉంటుంది. క్లబ్ లో తాగుతూ కొందరు మిత్రులు సరదాగా వేసుకున్న ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడంతో వాటి సేకరణ మొదలుపెట్టారు. అవి వింతగా ఉండటంతో పుస్తకంగా తెచ్చారు. అలా ఈ రికార్డుల ప్రయాణం మొదలై మంచి లాభదాయక వ్యాపారంగా సాగుతోంది. రికార్డు సాధించిన వారికి ఈ సంస్థ ఎలాంటి పారితోషికం ఇవ్వదు. రికార్డును నమోదు చేసుకోవాలని అనుకొనేవారే నిర్వహణ వ్యయాన్ని భరించాలి. వ్యక్తిగతంగా సాధించే రికార్డు కోసం ఆయా వ్యక్తులు వీడియో రూపంలో రుజువులను, చూసిన వారి ధ్రువీకరణలు నమ్మి రికార్డు పత్రాన్ని పంపుతారు. సాధారణంగా ప్రభుత్వాలు ఈ రికార్డుల కోసం తాపత్రయపడవు. మామూలుగా వ్యక్తులే ఏదో కొత్తది సాధించి గిన్నిస్ బుక్‌లో ఎక్కాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రికార్డులకు ఇవి అవి అనే ప్రత్యేక నియమాలేవి లేవు. మీసాలు, గోర్లు పెద్దగా పెంచినా గిన్నిస్ వరల్డ్ రికార్డే. మరొకరు సెంటీ మీటరు ఎక్కువ పెంచినా పాత రికార్డు బుక్ లోంచి తొలగించబడుతుంది.
ఎక్కువ పెన్సిళ్లు నోట్లో పెట్టుకున్నవాడు, ముక్కుతో టైపు చేసినవాడు, ఒంటికాలిపై ఎక్కువ దూరం నడిచినవాడు రికార్డు బ్రేకర్సే. దుబాయ్‌లో ఉండే రామ్ కుమార్ ఒంటి చేత్తో ఇప్పటికి 50 గిన్నిస్ రికార్డులు కొట్టేశాడు. సెంచరీ ఆయన టార్గెట్ అంట. ఇలా చిన్నాచితకా స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ పోతే గిన్నిస్ రికార్డు ఒక లక్ష్యమా అనిపిస్తుంది. ప్రభుత్వాలకు ఇది అవసరమా అని సామాన్యుడు కూడా అనుకుంటాడు. నిజానికి ఎవరైనా చేసిన గొప్ప విషయం రికార్డుల్లోకి ఎక్కాలి కానీ రికార్డుల కోసమే ఒక పని చేయడం అనేది అర్థం లేని విషయమే. ఒక నటుడు ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ సినిమాల్లో నటించడం ఒక వరల్డ్ రికార్డే. కానీ ఆయన రికార్డు కోసం అన్ని సినిమాల్లో నటించలేదు.
ఎంతో శ్రమపడి అన్ని అవకాశాలను పొందగలిగాడు. అనుకోకుండా రికార్డు దాటేశాడు. దాన్ని ఇంకొకరు దాటాలంటే కష్టసాధ్యంగా లేదా అసాధ్యంగా ఉండాలి. రికార్డు కొన్నేళ్లయినా నిలవాలి.అదీ రికార్డు అంటే. వీటితో పోల్చితే మన ప్రభుత్వం సాధించిన బతుకమ్మ రికార్డులు దాటేయడం తేలికే. వచ్చే సంవత్సరం ఒక వ్యక్తి తలచుకున్నా ఈ రికార్డులను బద్దలు కొట్టొచ్చు. 65 అడుగుల బతుకమ్మ పేర్చడం ఖర్చు, శ్రమతో కూడుకున్నదే కానీ పెద్ద కష్టమైన పనేమీ కాదు. అలాగే అమ్మలక్కల లెక్క దాటించడం కూడా సుసాధ్యమే. ఇలా చూస్తే ప్రభుత్వం భ్రమలో ఉందా లేక జనాన్ని మభ్యపెడుతుందా అనే అనుమానం కలగక మానదు. ప్రజాధనం పనికిరాని రికార్డుల కోసం కాకుండా ప్రజా ప్రయోజనం కోసం వెచ్చించబడాలి.