భారత్ లక్ష్యం 121 రన్స్, ప్రస్తుతం 63/1
ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకున్న విండీస్
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయానికి 58 పరుగుల దూరంలో నిలిచింది. 173/2 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాలుగో రోజు తిరిగి బ్యాటింగ్‌ను చేపట్టిన విండీస్ 390 పరుగులు చేసి ఆలౌటైంది. తర్వాత 121 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌ను చేపట్టిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ జట్టును లక్షం వైపు నడిపిస్తున్నాడు. సోమవారం ఆట నిలిపి వేసే సమయానికి రాహుల్ (25), సాయి సుదర్శన్ (30) పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టినవిండీస్ 248 పరుగులకే ఆలౌటై ఫాల్ ఆన్ ఆడింది.
హోప్, కాంప్‌బెల్ పోరాటం..
సోమవారం తిరిగి బ్యాటింగ్‌ను ప్రారంభిచిన విండీస్‌కు ఓవర్‌నైట్ బ్యాటర్లు కాంప్‌బెల్, షాయ్ హోప్‌లు అండగా నిలిచారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇటు కాంప్‌బెల్ అటు హోప్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ముందుకు సాగారు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కాంప్‌బెల్ లంచ్ బ్రేక్‌కు ముందే సెంచరీని సాధించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కాంప్‌బెల్ 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేసి కుల్‌దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇదే సమయంలో హోప్‌తో కలిసి మూడో వికెట్‌కు కీలకమైన 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లంచ్ తర్వాత హోప్ కూడా సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన హోప్ 214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (40) కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇక చివర్లో జస్టిన్ గ్రీవ్స్, జైడెన్ సీల్స్ అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. ఇద్దరు కలిసి చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించడం విశేషం. కీలక ఇన్నింగ్స్ ఆడిన గ్రీవ్స్ 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సీల్స్ 67 బంతుల్లో 32 పరుగులు చేసి చివరి వికెట్‌గా పెలివిలియన్ చేరాడు. దీంతో విండీస్ ఇన్నింగ్స్ 118.5 ఓవర్లలో 390 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, బుమ్రా మూడేసి వికెట్లను పడగొట్టారు. సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.