న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. ఐదో రోజు భారత్ మరో 58 పరుగులు సాధిస్తే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను వైట్ వాష్ చేస్తుంది. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటర్ల కనబరిచిన పోరాట పటిమకు క్రికెట్ లోకం ఫిదా అయింది. ముఖ్యంగా ఫాలో ఆన్‌లో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు క్యాంప్‌బెల్, హోప్‌ల జోడీ అండగా నిలిచింది. వీరిద్దరు సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేశారు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఓ రికార్డును సాధించారు.
మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ఈ జంట 51 ఏళ్ల తర్వాత ఓ రికార్డును తిరగరాశారు. 1974లో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు భారత గడ్డపై ఒకే టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్) గార్డన్ గ్రీనిడ్జ్ (107), క్లైవ్ లాయిడ్ (163) సెంచరీలు చేశారు. మళ్లీ ఇప్పుడు క్యాంప్‌బెల్, హోప్‌లు ఈ ఫీట్‌ని పునరావృతం చేశారు. ఇలా భారత గడ్డపై వెస్టిండీస్ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ఇది మూడోసారి. తొలుత 1948-49లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎవర్టన్ వీక్స్ (101), క్లైడ్ వాల్కాట్ (108) సెంచరీలు చేశారు.