మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి భూముల విషయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నడుస్తుండగా తాజాగా మరొ మలుపు చోటు చేసుకుంది. కంచగచ్చిబౌలిలో ఉన్న 2,725 ఎకరాల 23 గుంటల భూమికి నిజమైన యజమాని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అని ఆయన వారసులు తాజాగా ఆరోపిస్తున్నారు. అసఫ్ జాహి రాజవంశ వారసులు కంచగచ్చిబౌలిలోని 2,725 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు విచారిస్తున్న సుమోటో రిట్ పిటిషన్‌లో తమను చేర్చుకోవాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే చట్టపరమైన నోటీసులు జారీ చేశామని, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ఆపడానికి న్యాయపరమైన జోక్యాన్ని కోరుతున్నట్లు వారు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని 25,26 సర్వే నెంబర్లలోని కంచ గచ్చిబౌలి భూమి 2725 ఎకరాల 23 గుంటలు కలిగి ఉంది, ఇది చారిత్రాత్మకంగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు చెందినదని వారు పేర్కొన్నారు. తొమ్మిదవ నిజాంగా నియమించబడిన, అసఫ్ జాహి కుటుంబ వ్యవహారాల సంరక్షకుడు రౌనఖ్ యార్ ఖాన్ కంచ గచ్చిబౌలి భూమి పూర్వీకులు భారతదేశానికి చేసిన సేవకు చిహ్నం అని అభివర్ణించారు. ముత్తాత ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్, తాత ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, 1965 యుద్ధంలో ప్రజల కోసం విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలను నిర్మించినట్లు ఆయన వివరించారు. నిజాం వారసుల హక్కుగా భూములను రక్షించడం ద్వారా నిజాం వారసత్వాన్ని గౌరవించాలన్నారు. ఈ పోరాటం అభివృద్ధి ముసుగులో చరిత్ర చెరిపివేయకుండా కాపాడటం కోసమని రౌనఖ్ యార్ ఖాన్ స్పష్టం చేశారు.