మన తెలంగాణ/హైదరాబాద్‌ః రిజరేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమై మంతనాలు జరిపారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇటీవల ఖర్గే బెంగళూరులో అనారోగ్యానికి గురైనందున పరామర్శించేందుకు ఢిల్లీకి వచ్చానని చెప్పారు. ఖర్గే పూర్తిగా కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను, న్యాయ పోరాటాల గురించి ఖర్గేకు వివరించానని చెప్పారు.
ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఖర్గే అభినందించారని ఆయన తెలిపారు. రిజర్వేషన్లపై, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జారీ చేసిన జివోపై రాష్ట్ర హైకోర్టు ‘స్టే’ విధించినందున దీనిపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ‘స్టే’ను తొలగించాల్సిందిగా సుప్రీంను కోరుతూ సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వివరించారు. హైకోర్టులో జరిగిన విషయాలు, సుప్రీంలో దాఖలు చేయనున్న పిటిషన్ గురించి ఖర్గేకు వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్‌లో తమ పార్టీలోని పలువురు ముఖ్య నాయకులు కూడా ఇంప్లీడ్ కానున్నారని ఆయన చెప్పారు.
సమాచార లోపంతో సమస్య..
మంత్రుల మధ్య తలెత్తిన వివాదాల గురించి విలేకరులు ప్రశ్నించగా, చిన్న సమాచార లోపంతో తలెత్తిన సమస్యే తప్ప ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఓ కుటుంబంలా అందరూ కలిసి ఉన్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో అందరమూ చర్చించి పరిష్కరించుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.