గాజా: దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన కొత్త కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ సోమవారం ఇజ్రాయెల్ సజీవ బందీలు 20 మందిని రెండు దశల వారీగా విడిచిపెట్టింది. మొదటి దశలో సోమవారం ఉదయం ఏడుగురిని, రెండోదశలో మిగతా 13 మందిని విడిచిపెట్టి రెడ్‌క్రాస్ సొసైటీకి అప్పగించింది. వారిని తీసుకుని రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌కు బయలుదేరింది.
ఇక హమాస్ వద్ద ఉన్న 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు కూడా త్వరలోనే అప్పగించనుంది. ఒప్పందం కింద తమ వద్ద ఉన్న 48 మంది బందీలను హమాస్ విడిచిపెట్టనుంది. అందులో 20 మందే సజీవంగా ఉన్నారు. వీరిని గాజా లోని మూడు ప్రాంతాల్లో హమాస్ విడుదల చేసింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది.. ఈలోగా కాల్పుల విరమణకు మధ్యవర్తిగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్టులో గాజా శాంతి సదస్సులో పాల్గొనేందుకు ముందుగా ఇజ్రాయెల్‌కు విచ్చేశారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ఆయన ప్రసంగించనున్నారు. కాల్పుల విరమణను స్వాగతిస్తూ “ గాజా యుద్ధం ముగిసింది. ఈరోజు చాలా గొప్పదినం.ఇది శుభారంభం ” అని ట్రంప్ అభివర్ణించారు. శాంతి ప్రణాళిక ప్రకారం హమాస్ నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. బందీల కుటుంబీకులను కూడా ట్రంప్ కలుసుకుంటారు. మొదటి బ్యాచ్‌లో ఇజ్రాయెల్ బందీలు ఎయిటాన్ మోర్, గాలి అండ్ జివ్ బెర్మన్, మటాన్‌యాంగ్రెస్ట్, ఒమ్రి మిరాన్, గై జిల్బోయా, అలాన్ అహెల్, తదితరులు విడుదలయ్యారు. రెండోబ్యాచ్‌లో ఎవిటార్ డేవిడ్, ఎలాన్ ఒహెల్, ఎవినాటన్ ఓర్, ఎరియల్ కునియో, డేవిడ్ కునియో, నిమ్రోడ్ కొచెన్, బార్ కుపెర్‌స్టెయిన్, యుసఫ్ చైమ్ ఒహానా, సెగెవ్ కల్‌ఫాన్, ఎల్కనా బొహొబోట్, మాక్సిమ్ హెర్కిన్, ఎయిటాన్ హార్న్, రోమ్ బ్రస్లవ్‌స్కి విడుదలయ్యారు.
విడుదలకు ముందు బందీల్లో కొందరు వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబీకులతో మాట్లాడారు. రెండేళ్ల తరువాత తమ ప్రియతములను చూడగానే ఆయా కుటుంబాలు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రక్షణ దళం అప్‌డేట్‌ను రిటర్నింగ్ హోమ్ పేరున పోస్ట్ చేసింది. హమాస్ నుంచి విడుదలైన ఏడుగురి బందీలను ఐడీఎఫ్, ఐఎస్‌ఎ అధికారిక బృందాల సాయంగా ఇజ్రాయెల్‌కు తీసుకువస్తున్నట్టు పేర్కొంది. వారు చేరుకోగానే వైద్యపరీక్షలు జరుగుతాయి. మరికొంతమంది బందీలను ఈరోజు తరువాత రెడ్‌క్రాస్‌కు బదిలీ చేయడమవుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది.
ఇజ్రాయెల్ నగరాల్లో ఆనందం వెల్లువ
బందీల పరిస్థితులు ఎలా ఉన్నాయో వెంటనే లభ్యం కాకపోయినా, వారు విడుదలయ్యారన్న వార్తకు స్వదేశంలో అనేక చోట్ల ఆనందాతిశయాలు వెలువడ్డాయి. నగరాలు, పట్టణాల్లో జనం గుమికూడి విడుదల సంఘటనల లైబ్ బ్రాడ్‌కాస్ట్‌లను సందర్శిస్తుండటం కనిపించింది. టెల్ అవీవ్‌లో భారీ ఎత్తున బహిరంగంగా తెరలపై దృశ్యాలు ప్రదర్శించారు. చాలా మంది ఇజ్రాయెల్ పతాకాలను ఎగురవేశారు. గాజాలో ఇంకా ఉన్న వారి పేర్లు, ముఖాలు ప్రదర్శించే సంకేతాలు చూపించారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో రెయిమ్ మిలిటరీ స్థావరం వద్ద సూర్యోదయం కాగానే జనం గుమికూడి ఇజ్రాయెల్ పతాకాలు ఎగురవేశారు. నిశ్శబ్దంగా ప్రార్థనలు చేశారు. చప్పట్లు కొడుతూ పాటలు పాడారు. ఒక వ్యక్తి యూదుల సంప్రదాయ బాకా షోఫార్‌ను ఊదుతూ బందీలకు స్వాగతం పలికారు. కొంతమంది ఒహెల్ చిత్రాన్ని చిత్రించి ఉన్న టీ షర్టులు ధరించారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతుల స్వాగతం
బందీలు తిరిగి స్వదేశానికి తరలివస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య సారా లిఖితపూర్వకమైన స్వాగతం పలికారు. తాము రాసిన నోట్‌లో “ఇజ్రాయెల్ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మీకోసం నిరీక్షిస్తున్నాం. మిమ్మల్ని ఆనందంగా హత్తుకుంటాం” అని పేర్కొన్నారు. తిరిగివచ్చిన బందీలు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన రిసెప్షన్ కిట్ అందుతుందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆ కిట్‌లో దుస్తులు, వ్యక్తిగత సామగ్రి, లాప్‌టాప్, ఫోన్, టాబ్లెట్ ఉంటాయి. బందీలు వచ్చే దారి పొడుగునా ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్వాగత పతాకాలను నెలకొల్పారు.
ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తరువాత ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండోదశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ, ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి , 251 మందిని హమాస్ అపహరించిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమందిని గతంలో విడుల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించగా, మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారిని హమాస్ ఇప్పుడు విడిచిపెట్టింది.