మనిషికి మృత్యువు ఏ క్షణంలో ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. మృత్యు సమీపించే ఘడియలు వస్తే దాన్ని ఎవరూ ఆపలేరు. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడి విషయంలోనూ ఇదే జరిగింది. రైల్వే ట్రాక్ దాటేందుకు వచ్చిన ఆ యువకుడు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గ్రేటర్ నోయిడాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తుషార్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. కానీ, అతని బైక్ స్కిడ్ అయి ట్రాక్‌పై పడిపోయింది. వెంటనే తేరుకొని బైక్‌ను లేపే ప్రయత్నం చేశాడు. మరోవైపు రైలు వేగంగా రావడం గమనించి అక్కడి నుంచి తప్పుకుందామని అనుకున్నాడు. కానీ అప్పటికే రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో తుషార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వేట్రాక్‌లు దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గేట్ వేసి ఉన్న సమయంలో ట్రాక్‌పై నుంచి దాటడానికి ప్రయత్నించవద్దని పేర్కొన్నారు.