ఏదో నాకు కనిపించి కనిపించనట్టు
నీ నీడ తగిలిపోయిన అనుభూతి
ఛాయా స్పర్శ ఉండకపోవచ్చు
కానీ.. ఓయ్, నీ కదలికల నీడలు
ఇక్కడ వొదిలిన పరిమళాలు
నన్ను చుట్టు ముట్టుకుని
నీ స్మృతుల్ని ప్రత్యక్షం చేస్తున్నాయి
నువ్వున్న చోట నేను లేకపోవచ్చు
నేనున్న చోట నీ ఛాయలు
ఇంకా కదులుతూనే ఉన్నాయి
నమ్ము.. అదెలా సాధ్యం అని అడక్కు
అనుభూతుల్ని అవలోకనం
చేసుకుని చూడు
గుప్పెడు ప్రేమలో జ్ఞాపకాలను
తడిమి చూడు
నీ మనసు సుగంధాలు
నన్ను పెనవేసుకున్న అనుబంధాలు
వాటినెట్లా తెంచుకుని పోతావు
నీ దేహ సౌరభాలు ప్రకృతిని
హత్తుకొని పరవశించిన జాడలు
అన్నీ నాతో చెలిమి చేసిన పూరకాలు
పువ్వుల పుప్పొడులు..
కళ్ళముందు కవ్వించుకున్న
కల కళల వసంతం కరిగిపోవచ్చు
దారితప్పిన కలను మళ్ళీ కంటాను
రంగులు వెలసిన కళలకు
నీ పరిమళ వర్ణాలను అద్దుతాను
నీవిప్పుడు నా లోపలికి రావని తెలుసు
నేనెప్పుడూ నీ లోపలే ఉంటానని మరువకు
– డా. కటుకోఝ్వల రమేష్