58 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు అఫ్గాన్ ప్రకటన
19 అఫ్గాన్ చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ వెల్లడి
కాబూల్, ఇస్లామాబాద్, పెషావర్: ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ఇటీవలి పాక్ వైమానిక దాఢులకు ప్రతిగా ఆఫ్ఘన్ సరిహద్దుల్లో జరిపిన దాడులలో 58 మంది పాక్ సైనికులు చనిపోయారని తాలిబన్ ప్రకటించింది. ఈ ఆపరేషన్ లో మరో 30 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్ట్ లకు ఆశ్రయం కల్పించవద్దని పాకిస్తాన్ ను ఆదివారం తాలిబన్ హెచ్చరించింది. కాగా, సరిహద్దుల్లోని 19 ఆఫ్ఘన్ భద్రతా పోస్ట్ లను, టెర్రరిస్ట్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఆఫ్ఘన్ దళాలు ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, దిర్, చిత్రాల్, బలుచిస్తాన్ లోని బరంగా వద్దఉన్న పాక్ ఫోస్ట్ లు లక్ష్యంగా దాడులు జరిపాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిపినట్లు తాలిబన్ ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రతీకారదాడులు విజయవంతంగా సాగాయని ప్రకటించింది.
సరిహద్దుల్లో పాక్ గడ్డపై దాగిన ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్ట్ లను బహిష్కరించాలని, వీరి వల్ల ఆఫ్ఘనిస్తాన్ తో సహా ప్రపంచంలో అనేక దేశాలకు ముప్పు ఉందని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. తమ భూ, గగనతల సరిహద్ధులను రక్షించుకునే హక్కు తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణలో 20 మంది తాలిబన్ సైనికులు చనిపోవడమో, గాయపడడమో జరిగిందన్నారు.
కవ్వింపు లేకుండానే ఆఫ్ఘన్ దాడులు
సరిహద్దు పోస్ట్ లపై తాలిబన్లు జరిపిన దాడులను పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి మొహ్సిన్ నఖ్వీ ఖండించారు. ఎటువంటి కవ్వింపు లేకుండానే ఆఫ్ఘన్ సైనికులు పౌరులపై కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు. పాక్ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, ఆఫ్ఘన్ కు దీటుగా సమాధానం ఇస్తున్నామని ఆయన తెలిపారు.
గతవారం ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తాహ్రీక్ -ఇ- పాకిస్తాన్ (టిటిపి) జరిపిన టెర్రరిస్ట్ దాడులలో ఒకమేజర్, ఓ కల్నల్ తో సహా 11 మంది పాక్ సైనికులు మరణించడంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు దిగజారాయి. గురువారం రాత్రి పాక్ వైమానిక దాడులతో కాబూల్ దద్దరిల్లిందని ఆఫ్గన్ పేర్కొంది. దీనిని పాక్ ఖండించనూ లేదు. తమ ప్రమేయం లేదని ప్రకటించనూ లేదు. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశంలో పర్యటిస్తున్న సమయంలోనే రెండు దేశాల మధ్య పోరాటం జరగడం గమనార్హం.