ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శలు
క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట
కార్యకర్తలు, నేతలు బుద్ధిగా.. మంత్రులు ఇష్టారాజ్యంగా
మొదట సీతక్కా vs సురేఖ
మొన్న పొన్నం vs అడ్లూరి
నిన్న సురేఖ vs పొంగులేటి
నేడు వివేక్ vs ఆడ్లూరి
స్థానిక ఎన్నికల ముందు జనంలో పలుచన
చేష్టలుడిగిన క్రమశిక్షణా కమిటీ
మన తెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే విమర్శ నిజమేనని అనిపించేందుకు అమాత్యవర్యులు పోటి పడుతున్నారేమో? అంటే, అవునని అనిపించే విధంగా ఇటీవల మంత్రుల మధ్య జరుగుతున్న కుమ్ములాటలు , గిల్లికజ్జాలు నిరూపిస్తున్నాయి. దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉండి వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునేలా మంత్రుల వ్యవహార శైలీ ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఎన్నో కష్టనష్టాలకు నోచుకొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలు, నాయకులేమో బుద్ధిగా ఉంటే, మంత్రులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారని పార్టీ అధిష్టానం సైతం అనేక సందర్భాలలో అసహనం వ్యక్తం చేసిన ఉదంతాలు లేకపోలేదని తాజా ఉదంతాల నేపథ్యంలో గుర్తు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించాక, పార్టీని గాడిలో పెడుతుందని భావించారు. కానీ అలాంటి చర్యలేమి కనిపించడం లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ముఖ్యంగా మంత్రుల మధ్య సమన్వయం లోపం వల్లనే పార్లమెంట్ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయినట్టు ఆ ఎన్నికల ఫలితాల విశ్లేషణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టు అప్పట్లో పార్టీలో చర్చ జరిగింది.
ప్రస్తుత జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలు, రేపో, మాపో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు మంత్రుల మధ్య తలెత్తుతోన్న విభేదాలు, వివాదాలు, కుమ్ములాటల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధినేత మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్రంగా పరిగణిస్తోన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల ముందు మంత్రుల మధ్య విభేదాల పట్ల అధిష్టాన పెద్దలు కూడా సీరియస్‌గా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
మంత్రుల మధ్య గిల్లికజ్జాలు
మంత్రుల మధ్య విభేదాలకు మొదటి నుంచి వరంగల్ జిల్లా కేంద్ర బింధువు కాగా, అందుకు మంత్రి కొండా సురేఖ కారణం అవుతున్నారు. ఈ జిల్లాకు చెందిన మరో మంత్రి సీతక్కతో కొండా సురేఖకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత వారిద్దరు తమ మధ్య ఎలాంటి విభేదాలు, మనస్పర్థలు లేవని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి కొండా సురేఖకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పీసీసీ క్రమశిక్షణా సంఘం జోక్యం చేసుకొని ఏ దో విధంగా రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించినా ఇప్పటికీ వారి మధ్య గొడవలు సద్దుమణగలేదు. మళ్లీ తాజాగా జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై అధిష్టానానికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడంతో మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కింది.
వరంగల్ జిల్లా గాలి పొరుగున ఉన్న కరీంనగర్‌కు కూడా సోకిందేమో ఆ జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్‌కు మధ్య నిన్నగాక మొన్న తలెత్తిన విభేదాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జోక్యం చేసుకొని పరిష్కరించిన విషయం తెలిసిందే. ఈ వివాదం సమసిపోయిందని అనుకుంటున్న క్రమంలోనే తాజాగా మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఆడ్లూరి లక్ష్మణ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. నిజామాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, తనపై ఎవరో మంత్రి ఆడ్లూరిని రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు తాను ఇంచార్జీగా ఉండటం వల్ల అక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే తనకు ఎక్కడ పేరు వస్తుందే మోనని పార్టీలో కొందరు కుట్రపూరితంగా తనపై మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌తో ఆరోపణలు చేయిస్తున్నారని కూడా వివేక్ ఆరోపించారు. వీరిద్దరి మధ్య కొనసాగుతోన్న వివాదంలోకి మరో మంత్రి శ్రీధర్‌బాబును కూడా వివేక్ వెంకటస్వామి లాగారు.
దివంగత నేత జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఇటీవల నిర్వహించిన వేడుకల ఆహ్వన పత్రికలో ఆడ్లూరి లక్ష్మణ్ పేరు ముద్రించకపోవడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెబుతూ, మరి మంత్రి శ్రీధర్‌బాబు తండ్రి దివంగత శ్రీపాదరావు జయంతి వేడుకల ఆహ్వాన పత్రికలో కూడా ఆడ్లూరి లక్ష్మణ్ పేరు లేదు మరి ఆ విషయాన్ని ఎందుకు ప్రశ్నించలేదంటూ ఈ వివాదంలోకి శ్రీధర్‌బాబును లాగారు. మంత్రుల మధ్య బాహాటంగా గిల్లికజ్జాలు జరుగుతోన్న ఇదేదో తమకు సంబంధం లేని అంశంగా పీసీసీ క్రమశిక్షణ కమిటీ చేష్టలు ఉడిగినట్టు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి పదవి దక్కలేదన్న ఆగ్రహంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొందరిని టార్గెట్ బాహాటంగా వ్యాఖ్యలు చేస్తోన్నా క్రమశిక్షణ కమిటీ ఎందుకు సంజాయిషి కోరడం లేదని కూడా విమర్శలు వస్తున్నాయి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మంత్రుల వ్యవహారశైలీ మారడం, స్థానిక, ఉప ఎన్నికల ముందు వీరి గిల్లికజ్జాల పట్ల అధిష్టానం అహనంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
౦౦౦౦౦