అడ్లూరి నన్ను టార్గెట్ చేస్తున్నారు
ఆయనకు టికెట్ ఇప్పించిందే వెంకటస్వామి
మాలల ఐక్యవేదికలో కార్మిక మంత్రి వివేక్ వ్యాఖ్య
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: తాను మాల జాతికి చెందిన వాడినని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనను విమర్శిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో మాలల ఐక్యవేదిక ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీగా తనకు మంచి పేరు వస్తుందని అడ్లూరి లక్ష్మణ్‌కు కుళ్లు అని వ్యాఖ్యానించారు. అక్కడ మొదట కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండేదని, కానీ తాను ఇన్‌ఛార్జి అయ్యాక ఇప్పుడు సానుకూలంగా మారిందన్నారు. కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శిస్తున్నారని, మంత్రి శ్రీధర్ బాబు తండ్రి జయంతి కార్యక్రమం కార్డులో కూడా ఎవరి పేరు వేయలేదని, కానీ మంత్రి శ్రీధర్ బాబును ఎందుకు విమర్శించడం లేదన్నారు. తననే ఎందుకు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరి వ్యాఖ్యలపై వివేక్ మండిపడ్డారు. లక్ష్మణ్‌కు మొదట కాంగ్రెస్ టికెట్ ఇప్పించిందే కాకా వెంకటస్వామి అని, ఈ విషయం మరిచిపోతున్నారని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో అడ్లూరి తనను లక్షంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, మాలల అభివృద్ధ్ది కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. రోస్టల్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కొందరు మాల జాతిని కించపరిచే విధంగా కుట్రలు పన్నుతున్నారని, వాటిని తిప్పికొట్టాలంటే ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాలల రిజర్వేషన్ పెరిగేలా కృషిచేస్తాని అన్నారు. మాలలు ఐక్యంగా నిలబడి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని అన్నారు. తన తండ్రి జయంతి వేడుకలు జిల్లాలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సమావేశంలో పాల్గొన్న వర్దన్నపేట ఎంఎల్ఎ నాగరాజు అన్నారు. తాను జిల్లాలో సిపిగా పనిచేసే సమయంలో అందరూ సహకరించారని గుర్తు చేశారు. కాగా, రాజకీయాల్లో కుల వివక్ష కొనసాగుతోందని, దీనిపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 1, 2 ర్యాంకులు సాధించిన అభ్యర్థులను సన్మానించారు.