రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు 5663 దరఖాస్తులు
ఈనెల 18 వరకే గడువు
మిగిలింది వారం రోజులే.. చివరి రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే చాన్స్
ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మద్యం షాపులకు దరఖాస్తుల జోష్ కొనసాగుతోందని ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు శనివారం సాయంత్రం వరకు 5663 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈనెల 18తో దరఖాస్తుల స్వీకరణ అంకం పూర్తి కానుందని, చివరి మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని అంచనావేస్తున్నామన్నారు. గత రెండేళ్ల క్రితం సైతం చివరి రెండు రోజుల్లో 45 వేల నుంచి 50వేల దరఖాస్తులు వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఈసారి చివరి మూడు రోజుల్లో దరఖాస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయని, సోమవారం నుంచి శనివారం వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
చివరి రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే అంచనాలు ఉండడంతో ఎక్సైజ్ డివిజన్ల వారిగా, రంగారెడ్డి, హైదరాబాద్ డివిజన్ల లో ను, ఉమ్మడి జిల్లాల వారీగా అదనపు కౌంటర్లు ఏర్పాటుతోపాటు దరఖాస్తుదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. గత రెండేళ్ల క్రితం మద్యం షాపులకు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి దరఖాస్తులు గతంలో కంటే మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామన్నారు. ఈ సారి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తులు వేయడానికి మద్యం వ్యాపారులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుందన్నారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. మరోపక్క మద్యం షాపులకు కేటాయించిన రిజర్వేషన్లు గౌడ్, ఎస్సీ, ఎస్టీ మద్యం షాపులకు దరఖాస్తులు పోటాపోటీగా పడుతున్నాయని వెల్లడించారు. గౌడ షాపులకు 671 దరఖాస్తులు, ఎస్సి రిజర్వేషన్లు 202, ఎస్టి రిజర్వేషన్లు 84, జనరల్ లో 4686 దరఖాస్తులు వచ్చాయన్నారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ లో 142, హైదరాబాదులో 746, కరీంనగర్‌లో 392, ఖమ్మంలో 260, మహబూబ్ నగర్‌లో 278, నల్లగొండలో 568, మెదక్‌లో 411, నిజామాబాద్‌లో 255, రంగారెడ్డిలో 2353, వరంగల్లో 258 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.