చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్
ఈనెల 18న బందు పర్ జస్టిస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర బంద్
13న రహదారుల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా
తెలంగాణ బంధ్ తో బిసిల బలమేంటో చూపిస్తాం
బిసిల నిరసనను గల్లి నుంచి ఢిల్లీ దాకా సెగ పుట్టిస్తాం
ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఐక్యంగా ముందుకు తీసుకుపోవడానికి బిసి ఐక్య కార్యాచరణ కమిటీ (బిసి జెఎసి) ఏర్పాటయ్యింది. ఆదివారం హైదరాబాద్, లక్డీకాపూల్ లోని ఓ హోటల్‌లో బిసి సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఉద్యోగులు సమావేశమయ్యారు. బిసి రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టుల ద్వారా అడ్డుకోవాలని ఇప్పటికే రెడ్డి జాగృతికి చెందిన నేతలు ప్రయత్నిస్తుండడంతో ఉద్యమించే బిసి సంఘాలు తమ తమ సంఘాల ద్వారా కాకుండా ఉమ్మడి ఎజెండాతో జెఎసి ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా బిసి జెఎసి చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా విజిఆర్ నారగోని, కో చైర్మన్ లు గా రాజారాం యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జ కృష్ణ ను ఎన్నుకున్నారు. బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వదాన్ని నిరసిస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 13న ఇచ్చిన జాతీయ రహదారుల దిగ్బంధం, ఆర్ కృష్ణయ్య ఈనెల 14న ఇచ్చిన రాష్ట్ర బందును వాయిదా వేసి ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్‌ను చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ సందర్భంగా జెఎసి చైర్మన్, పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించి రాష్ట్రంలోని బిసిలకు అన్యాయం చేసిందని, ఈ అన్యాయాన్ని నిరసిస్తూ బిసిలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి బిసి రిజర్వేషన్లు అమలు చేస్తాయని అన్నారు. ప్రస్తుత బిసి రిజర్వేషన్ల ఉద్యమం భవిష్యత్తులో చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించే వరకు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈనెల 14న నిర్వహించాల్సిన తెలంగాణ రాష్ట్ర బందును 18కి వాయిదా వేశామని 18న జరిగే బందును పార్టీలకతంగా బిసిలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతం ఉన్న బిసిలు ఐక్యంగా లేరని బిసిలకు రావలసిన నోటికాడ ముద్దను పిడికెడు శాతం లేని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ వ్యతిరేకులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ పుట్టియడానికి బిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అందుకు రాష్ట్రంలో ఉన్న ప్రధాన బిసి సంఘాలను, వ్యక్తులను, శక్తులను కలుపుకొని బిసి జెఎసిగా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. ఈనెల 18న జరిగే బంద్ ద్వారా బిసిల బలమేందో, బిసిల శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రుచి చూపిస్తామని ఆయన హెచ్చరించారు బిసిల ఐక్యత ద్వారా తెలంగాణలోని బిసి సమాజానికి విశ్వాసం కల్పించి పార్టీలుగా సంఘాలుగా విడిపోయిన బిసి శ్రేణులను ఒక్కటి చేసి తెలంగాణలో బిసిల రాజకీయ అధికారానికి పునాదులు వేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ సమావేశంలో 40 బిసి సంఘాలు, 110 బిసి కుల సంఘాలతో పాటు ముఖ్యంగా బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, కొండ దేవయ్య, శేఖర్ సగర, నీల వెంకటేష్, తాటికొండ విక్రం గౌడ్, కనకాల శ్యాం కుర్మా, కేపీ మురళీకృష్ణ, అనంతయ్య, రామకోటి, వేముల రామకృష్ణ, ఈడిగ శ్రీనివాస్, భూపేష్ సాగర్, గొడుగు మహేష్ యాదవ్, వరికుప్పల మధు, గుజ్జ సత్యం, రమాదేవి, లక్ష్మి, భూమన్న యాదవ్, రాజు నేత, దీటి మల్లయ్య, రాజేందర్, పగిల సతీష్, రామ్మూర్తి, బడే సాబ్ తదితరులు పాల్గొన్నారు.