హైదరాబాద్: మహాత్మ గాంధీ గురించి నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీకాంత్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా శ్రీకాంత్ తన మాటలకు క్షమాపణలు చెప్పారు. కొన్ని రోజుల క్రితం తాను పెట్టిన పోస్టు చాలామంది మనోభావాలను దెబ్బ తీసిందని.. అందుకు వారందరికీ క్షమాపణలు చెప్తున్నానని పేర్కొన్నారు.
శ్రీకాంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు కూడా ఆ ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ ‘మా’ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. పబ్లిసిటీ కోసమే శ్రీకాంత్ చరిత్రను వక్రీకరించారని.. గాంధీ సిద్ధాంతాలను నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీశారని పేర్కొన్నారు. నటుడిపై ‘మా’ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సినీ పెద్దలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ క్షమాపణలు చెప్పారు.