మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదంపై త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో పరిష్కరించుకుంటామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ అన్నారు. మంత్రుల మధ్య సమాచార లోపం వల్ల వివాదం తలెత్తిందని గాంధీభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరి మధ్య తలెత్తింది చాలా చిన్న సమస్య అన్నారు.
ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం చెప్పారు. త్వరలో ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి వద్ద కూర్చొని పరిష్కరించుకుంటామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంపై ప్రస్తావించగా, తమ పార్టీలో స్వేచ్చ ఎక్కువ అన్నారు. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరైనా పార్టీ నాయకత్వానికి చెప్పుకునే స్వేచ్చ తమ పార్టీలో ఉంటుందన్నారు. అధిష్టానం దృష్టికి ఎవరైనా ఆర్జీ పెట్టుకోవచ్చని మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.