న్యూఢిల్లీ: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ 518/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు కుల్దీప్ (5 వికెట్లు), జడేజా (3 వికెట్లు) చెలరేగిపోవడంతో వెస్టిండీస్ 248 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వెస్టిండీస్ 270 పరుగులు వెనుకంజలో ఉండి ఫాలోఆన్ నుంచి తప్పించుకోలేకపోయింది.
అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ వెస్టిండీస్ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ చంద్రపాల్ (20) సిరాజ్ బౌలింగ్‌లో, అలిక్ అతాంజే (7) సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. దీంతో మూడో రోజే విండీస్ ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ, ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోలు కలిసి వీరోచితంగా పోరాడారు. వికెట్ కాపాడుకుంటూ స్కోర్‌ని పెంచుతూ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఇరువురు అర్థ శతకాలు సాధించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 49 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్‌లో క్యాంప్‌బెల్ (87), హోప్ (66) ఉన్నారు.