హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఓడిస్తే కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి వస్తుందని, ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లవుతున్నా ప్రతిదానికి ఇంకా మాజీ సిఎం కెసిఆర్ నే నిందిస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలుపై రేవంత్ రెడ్డిని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక ఏం చేశారు అంటే.. గరీబ్ వాళ్ల ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడికి బుల్డోజర్ మాత్రం పంపించారని, హైడ్రా అని కొత్త దుకాణం పెట్టి ఉన్న ఇల్లు కూలగొడుతున్నారని ఎద్దేవా చేశారు. మీకు కారు కావాలి అంటే బిఆర్ఎస్ గెలవాలని, గోపీనాథ్ భార్య సునీత గెలవాలని కోరుకోండని అన్నారు. మీ ఇంటికి బుల్డోజర్ రావాలి అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని కెటిఆర్ దుయ్యబట్టారు.