గిల్ అజేయ శతకం, భారత్ 518/5 డిక్లేర్డ్
జడేజా మ్యాజిక్.. విండీస్ 140/4
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా పైచేయి సాధించింది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134.2 ఓవర్లలో 518 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్ శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే విండీస్ మరో 378 పరుగులు చేయాలి. మొదటి ఇన్నింగ్స్ కరీబియన్ టీమ్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ 2 ఫోర్లతో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన అలిక్ అతనాజెతో కలిసి మరో ఓపెనర్ త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించాడు. ఇద్దరు కలిసి భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు.
భారీ షాట్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు దాదాపు 20 ఓవర్ల పాటు నిరీక్షించక తప్పలేదు. అయితే 67 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులు చేసిన చందర్‌పాల్‌ను జడేజా ఔట్ చేశాడు. దీంతో 66 పరుగుల రెండో వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. కొద్ది సేపటికే అలిక్ అతనాజె కూడా పెవిలియన్ చేరాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అలిక్ ఐదు బౌండరీలు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ వికెట్‌ను జడేజా పడగొట్టాడు. ఆట ముగిసే సమయానికి షాయ్ హోప్ ఐదు బౌండరీలతో 31 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ (14) బ్యాటింగ్ అండగా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లను పడగొట్టాడు.
గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..
అంతకుముందు 318/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం తిరిగి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో రోజు ఆటలో ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 258 బంతుల్లో 22 ఫోర్లతో 175 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ గిల్‌తో సమన్వయం లోపించడంతో యశస్వి పెవిలియన్ చేరక తప్పలేదు. దీంతో డబుల్ సెంచరీ సాధిస్తాడని భావించిన యశస్వికి నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ గిల్ తనపై వేసుకున్నాడు. అతనికి నితీశ్ కుమార్ రెడ్డి అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఈ జోడీని విడగొట్టేందుకు విండీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇక ధాటిగా ఆడిన నితీశ్ 54 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. అనంతరం వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా గిల్‌కు సహకారం అందించాడు. అతని అండతో గిల్ స్కోరును ముందుకు నడిపించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గిల్ 16 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 5 ఫోర్లతో 44 పరుగులు చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు.