ఇటీవలే హైదరాబాదులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించడానికి వచ్చిన జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ సేథ్ వైద్య విద్యారంగం బాగుపడాలంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్ (పిపిపి) పద్ధతిలోనే సాధ్యమని ప్రకటించారు. వైద్య విద్యను ప్రైవేటు రంగానికి అప్పగించవలసిన అవసరాన్ని ఆయన మరింత వివరిస్తూ గుజరాత్ రాష్ట్రంలో బ్రౌన్ ఫీల్డ్ మెడికల్ కళాశాల విధానాన్ని గొప్ప ప్రయోగంగా అభివర్ణించారు. ప్రైవేటుపరం అంటే ప్రతికూల స్పందన వస్తుంది కాబట్టి దానికి పెట్టిన ముద్దు పేరే పిపిపి. సౌకర్యాల లేమితో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగంలోని జిల్లా ఆస్పత్రులను ఈ గుజరాత్ అనుభవం ఎంత మెరుగుపరిచిందో చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు సంస్థల యాజమాన్యాల్లోకి వెళ్లి ఎంత గొప్ప వైద్య విద్యా నిలయాలుగా భాసిల్లుతున్నాయో కూడా వివరించారు. డాక్టర్ అభిజిత్ సేథ్ ప్రసంగం ఆసాంతం వింటే ఆయన పార్లమెంట్ చట్టం చేస్తే ఏర్పడిన సంస్థలలో ఒకటైన జాతీయ వైద్య కమిషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారో లేక ప్రైవేట్ వ్యాపారుల సంస్థల కార్పొరేట్ ఏజెంట్ల ప్రతినిధిగా మాట్లాడుతున్నారో అర్థం కాదు.
ఆస్పత్రుల అజమాయిషీని చేపట్టడంవల్ల ఫలానా ప్రైవేట్ సంస్థలకు లాభార్జన కంటే సమాజంలో గుర్తింపు ఎక్కువగా వస్తుందని, ఆ ప్రైవేటు సంస్థల సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత) నిధులు సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందని సేథ్ హితబోధ చేశారు. అంతేకాదు, డాక్టర్ సేథ్ మరో గొప్ప సూచన కూడా చేశారు. వైద్యరంగంలోని సీనియర్ రిటైర్డ్ అధ్యాపకులు జాతీయస్థాయిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థల సహకారంతో వైద్య విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దవచ్చునని చెప్పారు.1956లో పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఏర్పాటైన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ దాదాపు 63 ఏళ్ల తర్వాత రద్దయి, దాని స్థానంలో పార్లమెంటు బిల్లు రూపంలో ఆమోదించిన అనంతరం ఈ జాతీయ మెడికల్ కమిషన్ ఏర్పాటు అయింది. దానికి అధ్యక్షుడిగా ఉన్న అభిజిత్ సేథ్ ఇటీవల హైదరాబాద్ వచ్చి, వైద్య విద్యను పిపిపి రూపంలో ప్రైవేటుపరం చేసే విషయమై ఇటువంటి చిలక పలుకులు పలికారు. ఆయన సూచిస్తున్న విధంగా జరిగితే ఈ దేశంలో వైద్యరంగం మొత్తంగా ప్రైవేటుపరం అవుతుంది.
ప్రైవేట్ సంస్థలు సమర్ధవంతంగా నిర్వహిస్తాయా, ప్రభుత్వ రంగంలోకంటే వైద్య విద్య గాని, ప్రజలకు హక్కుగా అందాల్సిన వైద్యంగానీ గొప్పగా ఉంటాయా అన్నది ఎవరు కచ్చితంగా చెప్పలేరు. గుజరాత్ బ్రౌన్ ఫీల్డ్ వైద్య కళాశాల విధానం అంతటా సక్రమంగా అమలు కావాలని రూల్ ఏమీ లేదు కదా. ఆయన సూచనలు హాస్యాస్పదమే కాకుండా ప్రమాదకరంగా కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆరోగ్య హక్కును స్పష్టంగా పేర్కొనక పోయినప్పటికీ, సుప్రీం కోర్టు దీనిని ఆర్టికల్ 21 కింద (జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ) ప్రాథమిక హక్కుగా పేర్కొంటోంది. దీని ప్రకారం ఒక మనిషికి స్వేచ్ఛగా పరిశుభ్రమైన వాతావరణంలో వైద్య సంరక్షణ సౌకర్యాలతో, గౌరవప్రదంగా జీవించే వెసులుబాటు ఈ చట్టం ప్రకారం సంక్రమిస్తోంది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే బాధ్యత రాజ్యం మీదే ఉంటుందని ఆర్టికల్ 47లోని ఆదేశిక సూత్రాల్లో రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది కూడా. పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఏర్పడిన సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డాక్టర్ అభిజిత్ సేథ్ మరి రాజ్యాంగాన్ని చదువుకోలేదా? సుప్రీం కోర్టు నిర్వచనాలు ఆయన దృష్టికి రాలేదా? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది వైద్యుల సంఘం.
అదేమీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వ సంస్థ కాదు. ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులను అటువంటి సంస్థలు చేయాలని, పదవీ విరమణ చేసిన అధ్యాపకులు ఒక జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరడం హాస్యాస్పదమే కాక వైద్య విద్యారంగానికి, ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైందని కూడా చెప్పాల్సిందే.ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ పిపిపి పద్ధతిని అనుసరించాలని తహతహలాడిపోతున్న తరుణంలో, ఆ ప్రయత్నాలు ప్రారంభించి ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న సమయంలో డాక్టర్ అభిజిత్ సేథ్ వంటివారు చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాల అసమర్ధతను బట్టబయలు చేస్తాయి.వాటిని సమర్థించే విధంగా ప్రతిపాదనలు తీసుకురావడం దుర్మార్గం. మిగతా విషయాలు ఎలా ఉన్నా విద్య, వైద్యం ఈ రెండు రంగాలు ప్రభుత్వ అధీనంలోనే ఉండి ఈ దేశంలోని ప్రతి మనిషికి అవి సమానంగా అందే విధంగా చూడటం ఒక రాజ్యాంగపరమైన బాధ్యత అన్న విషయం డాక్టర్ అభిజిత్ సేథ్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా మర్చిపోతున్నారు.
16 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన, 47 ఏళ్ల రాజకీయ అనుభవం గల చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలలన్నిటిని పిపిపి పద్ధతిన ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడానికి సంకల్పించారు, అదే పనిలో ఉన్నారు కూడా. గుజరాత్ బ్రౌన్ ఫీల్డ్ మెడికల్ కళాశాల విధానం అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వైద్య విద్యను ప్రైవేటురంగానికి అప్పగించాలన్న ఆలోచన చేయడం అనవసరమైంది.వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గడచిన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో 17 వైద్య కళాశాలలు నిర్మించేందుకు 7,800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు జరిగింది. వాటిలో ఏడు కళాశాలల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడం కూడా ప్రారంభం అయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అయిదు కళాశాలల నిర్మాణం పూర్తయితే గతేడాది చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకొక రెండు పూర్తయ్యాయి. మిగతా పది కళాశాలల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నది. ఈ 17 కళాశాలల్లో వైద్య విద్యతోపాటు టీచింగ్ ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాలలు కూడా ఉంటాయి. ప్రభుత్వాలనేవి పార్టీలతో సంబంధం లేకుండా కొనసాగాలనే స్పృహ అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడికి ఇంకొకరు కలిగించవలసిన అవసరం లేదు కదా.
ప్రైవేటు రంగంలో వైద్య కళాశాలల నిర్వాకం ఎలా ఉంటుందో మనం అనేకమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. అంతెందుకు, ఇప్పుడు వైద్యరంగాన్ని పిపిపి పేరిట ప్రైవేటుపరం చెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్న చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రైవేటు రంగంలో అనుమతి ఇవ్వకూడదని చేసిన ఉద్యమం కారణంగా నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడిన సంగతి ఎలా మరిచిపోయారు? అప్పటికీ, ఇప్పటికీ ఏం మారింది? ఇప్పుడు వీటన్నిటిని పిపిపి పేరిట ఎందుకు ప్రైవేటుపరం చేయదలుచుకున్నారు?జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ కళాశాలల నిర్మాణానికి కావలసిన స్థలాలను ప్రైవేటు భూములను కూడా సేకరించి ప్రారంభించారు. వాటన్నిటికీ ఇప్పుడు ఏడాదికి ఎకరానికి 100 రూపాయల చొప్పున లీజుకు ప్రైవేటుసంస్థలకు అప్పగించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయించడం ఎంత విచిత్రం. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం చెబుతున్నారంటే ఈ వైద్య కళాశాలలన్నీ మనకే అంటే ప్రభుత్వానికే ఉంటాయని, అయితే 66 సంవత్సరాల అనంత అని ప్రజలను సముదాయిస్తున్నారు. 66ఏళ్ల తర్వాత ఎవరు ఏమిటో ఎవరికి తెలుసు? పైగా ఇవాళ భారతదేశంలో ప్రైవేటు రంగంలో ఆసుపత్రులు నడుపుతున్న కార్పొరేట్ శక్తులు వైద్య సేవల పేరిట ప్రజలను ఎంతగా పీడిస్తున్నది విజ్ఞులైన అభిజిత్ సేథ్‌కు కానీ, చంద్రబాబు నాయుడుకు గానీ చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు వైద్య విద్యను కూడా ప్రైవేటు వారికి అప్పగించేసి చేతులు దులుపుకుంటే ప్రభుత్వాలు ఇంకా ఏం చేద్దామని? ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేది తమ బాగోగులు చూసుకోమని కదా. ఇలా ఒక్కటొక్కటిగా ప్రైవేటువారికి అప్పగించేస్తే ఇంక ప్రభుత్వాలు దేనికి?అప్పుడెప్పుడో, మన చిన్నప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ అని ఇచ్చిన నినాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోని ప్రభుత్వం మరో విధంగా అమలు చేయాలని ఆలోచన చేస్తున్నది. తన తొలి రాజకీయ గురువు అయిన ఇందిరాగాంధీ గరీబీ హటావ్ అంటే చంద్రబాబు నాయుడు దాన్ని ఇంగ్లీషులో ‘జీరో పావర్టీ’ అంటున్నారు. ఇక్కడ ఆయన ఇంకొక పీ చేర్చి ‘పీ ఫోర్’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేస్తామని చెప్తున్నారు. పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్ అన్నమాట. వివరంగా చెప్పుకుంటే సంపన్నులు ముందుకొచ్చి ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు తోడుగా నిలిచి, మద్దతు అందించి మార్గనిర్దేశం చేయడం ఆయన లక్ష్యం. ప్రతి కుటుంబానికి వారి అవసరాలకు తగిన విధంగా అధునాతన మార్గాల సహాయం అందించి, ప్రతి కుటుంబం ఎదిగి ఉమ్మడిగా అభివృద్ధి చెందే విధంగా భవిష్యత్తు నిర్మించేందుకు జరిగే కృషి ఇది అని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం చెబుతోంది. ఇలా పేదలకు చేయూతనందించే ఈ సంపన్నులను ‘మార్గదర్శకులు’ అంటారు. సహాయం అందుకోబోయే పేద కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’ అంటారు.
ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికే 14,495 మంది మార్గదర్శకులు 9,62,943 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అంటే దాదాపు 40 లక్షలమంది పేద ప్రజల జీవితాలు పూర్తిగా సుఖమయం అయినట్టే మనం భావించాలి. ప్రజల్ని మాయచేసి పబ్బం గడుపుకోవడం అంటే ఇదేనేమో. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు చేయాల్సిన పనుల్లో పేదరికం నిర్మూలన, ప్రతి పౌరుడికి విద్య, వైద్యం విషయంలో గల ప్రాథమిక హక్కును కాపాడే బాధ్యత ముఖ్యమైనవి. వాటిని రాజకీయ పక్షాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది.