మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కృష్ణా గో దావరి నీటి వాటాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, కా నీ కాంగ్రెస్ 22 నెలల పరిపాలనలో ఎక్కడా రాజీపడకుండా మూడు రాష్ట్రాలతో కొట్లాడుతూ రాష్ట్ర నీటి వాటాలను సాధించుకుంటున్నామని పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించా రు. నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డికి మాతృవియోగం కలగగా శనివారం మంత్రులు ఉత్తమ్, సీతక్క, ఎంపి బలరాం నాయక్ ఎంఎల్‌ఎ నాగరాజుతో కలిసి దొంతి మాధవరెడ్డిని కలిసి పరామర్శించారు. అనంతరం మాధవరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణలో ఈ ఖరీఫ్ సీజన్లో మునుపెన్నడూ లేనివిధంగా ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు.
ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఒక్క నీటి చుక్కను కూడా తీసుకోకుండా వరి పంట సాగును చేపట్టామని అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. ఇది దేశంలోనే రికార్డు స్థాయి పంట ఉత్పత్తి అన్నారు . ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు నిదర్శనమని అన్నారు. బిఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రలో నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాను, సహచర మంత్రివర్గంతో కలిసి సిడబ్ల్యుసిలో మౌఖిక, రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడమే కాకుండా న్యాయపరంగా కూడా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల నీటి వాటా కేటాయింపుల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించుకుంటామని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో అనుబంధం ఉన్నప్పటికీ అక్కడ ఆలమట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచే విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. దానిపై కూడా తాము కేంద్రంతో తలపడుతున్నామని చెప్పారు. తెలంగాణకు నీటి వాటాల కేటాయింపుల్లో నష్టం వచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టడం లేదన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రాజీ పడకుండా తెలంగాణ నీటి వాటాల కేటాయింపు వాటిపై ప్రత్యక్ష పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. పదేండ్ల బిఆర్‌ఎస్ పరిపాలనలో తెలంగాణకు కృష్ణా గోదావరి జలాల డ్యూటీ వాటాల కేటాయింపులో అన్యాయం జరిగిందన్నారు.
కృష్ణాజలాల వాటిలో కూడా అన్యాయం జరిగినప్పటికీ నాడు కెసిఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మిలాఖత్ అయి, కృష్ణాజలాల నీటి వాటాలను తెలంగాణకు కేటాయించకుండానే తరలించుకోకపోయినా బిఆర్‌ఎస్ పాలకులు చూస్తూ ఉండిపోయారు తప్ప న్యాయం చేయలేదన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇది ప్రజలు ఏర్పరచుకున్న ప్రభుత్వమని, ప్రజల ఆలోచనలతో ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్నిరంగాలపై ప్రభుత్వ, మంత్రివర్గం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.