ఒడిశా లోని జలేశ్వర్‌కు చెందిన వైద్య విద్యార్థినిపై పశ్చిమబెంగాల్ లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగింది. బెంగాల్ లోని పారిశ్రామిక కేంద్రమైన దుర్గాపూర్ లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బాధితురాలు ఎంబీబీఎస్ చదువుతున్నారు. రెండో సంవత్సరం వైద్య విద్యార్థిని అయిన ఆమెపై శుక్రవారం రాత్రి ఈ దురాగతం జరిగిందని పోలీసులు శనివారం వెల్లడించారు. ఆరోజు రాత్రి 8.30 గంటలకు ఆమె తన స్నేహితుడితో కలిసి డిన్నర్‌కు క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిందని, ఆ తర్వాత రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆమె స్నేహితుడు ఒంటరిగా క్యాంపస్ గేటు వద్ద ఆమెను విడిచిపెట్టగా, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమె వద్ద ఫోన్‌ను కాజేసి, బలవంతంగా క్యాంపస్ బయట అటవీ ప్రాంతానికి లాక్కుని వెళ్లారని పోలీసులు చెప్పారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్ ఆఫీసర్ ఆరోపించారు.
ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని తెలిపారు. ఆమె మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వడానికి డబ్బులు కూడా డిమాండ్ చేశారన్నారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని , బాధితురాలి స్నేహితునితో కూడా గత రాత్రి మాట్లాడామని చెప్పారు.సిసిటివీ ఫుటేజీ నుంచి సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని , సాక్షాధారాల సేకరణకు ఫోరెన్సిక్ బృందం ఆ ప్రాంతానికి వెళ్తుందని చెప్పారు. తమ కుమార్తె శుక్రవారం రాత్రి కాలేజీ క్యాంపస్ బయట 10 గంటల ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి గురైందని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఈ సంగతి తెలియగానే తాము శనివారం ఉదయం ఇక్కడకు పోలీస్‌లకు ఫిర్యాదు చేయడానికి వచ్చామన్నారు. ఈ కాలేజీ బాగా చదువు చెబుతుందని విన్నామని, అందుకనే ఇక్కడకు తమ కుమార్తెను పంపామని విద్యార్థిని తండ్రి చెప్పారు. బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను కలుసుకోవడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సిడబ్లు) బృందం దుర్గాపూర్ బయలు దేరింది.
“ బెంగాల్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, ఆ కేసుల్లో పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఎన్‌సిడబ్లు సభ్యురాలు అర్చనా మజుందార్ ఆరోపించారు. ఇలాంటి నేరాలు జరగకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తాను అభ్యర్థించనున్నట్టు ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా, సంఘటనకు సంబంధించి ప్రైవేట్ మెడికల్ కాలేజీ నుంచి నివేదికను శనివారం రాష్ట్ర ఆరోగ్యశాఖ కోరింది. నివేదిక రాగానే తక్షణం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.