గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ తెహ్రీక్ ఇలబైక్ పాకిస్థాన్ కార్యకర్తలు గురువారం నుంచి పాక్ లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ అల్లర్లలో పంజాబ్ పోలీసులు తమ 11 మంది కార్యకర్తలను హత్య చేసినట్టు ఆ పార్టీ చీఫ్ సాద్ రిజ్వి ఆరోపించారు. ఘర్షణల సమయంలో 24 మందికి పైగా కార్యకర్తలు గాయపడినట్టు పేర్కొన్నారు. వారిని ఆస్పత్రులకు తీసుకువెళ్తే వైద్యం చేయడానికి కూడా అక్కడి వైద్యులు నిరాకరించారన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని సాద్ రిజ్వి ఆరోపించారు. తన నివాసంపై దాడి చేసి తన తల్లిని, భార్యా పిల్లలను అదుపు లోకి తీసుకున్నారని మండిపడ్డారు.
గాజాలో మరణాలు, శాంతి ప్రణాళికను నిరసిస్తూ తెహ్రీక్ ఇలబైక్ పాకిస్థాన్ కార్యకర్తలు గురువారం పాక్ లోని పలు ప్రాంతాల్లోని నిరసనలు చేపట్టారు. శుక్రవారం నిరసనకారులు ఇస్లామాబాద్ లోని అమెరికా ఎంబసీ ముట్టడికి యత్నించడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్న క్రమంలో ఘర్షణలు చోటు చేసుకుని పలువురు టీఎల్‌పికార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలో నిరసనల కారణంగా పాకిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో ప్రధాన రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో లాక్‌డౌన్ విధించినట్టు అధికారులు పేర్కొన్నారు.