మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం పోలీసులకు (సిసిఎస్) ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాంత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉంటారని ఆయన తెలిపారు. ‘మా’ అసోసియేషన్ సభ్యత్వం నుంచి నటుడు శ్రీకాంత్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై తాము సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు ‘మా’ అసోసియేషన్‌కు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థకూ ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లనో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేస్తారని ఆయన చెప్పారు. అల్లు అర్జున్ విషయంలో స్పందించిన చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రతి చిన్న అంశానికీ స్పందించే సోషల్ మీడియా కూడా ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు.