నేటి తరంలో పిల్లలు మొబైల్ ఫోన్లలో, గేమ్స్‌లో మునిగిపోయి ఉండగా చింతల్ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన 13ఏళ్ల భవాని అనే బాలిక అసాధారణ ధైర్యంతో అందరికీ ఆదర్శంగా నిలిచింది. పట్టపగలే చోరీకి యత్నించిన దొంగను ప్రాణాలకు తెగించి అడ్డుకుని, దొంగతనాన్ని విఫలం చేసింది. చింతల్ భగత్ సింగ్ నగర్‌లోని రోడ్ నంబర్ 12లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న కావలి భవాని, తమ ఇంటి కింద పోర్షన్ లో ఉమా మహేశ్వరి, చంద్రశేఖర్ దంపతుల తాళం వేసి బయటకు వెళ్ళారని తెలుసుకుని ఈ అవకాశాన్ని గమనించిన ఓ దొంగ, ఇంటి తాళం బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. కింది ఇంట్లో ఏదో చప్పుడు వినిపించడంతో పైన ఉన్న భవానికి అనుమానం వచ్చి కిందికి దిగి వచ్చింది. ఇంట్లో దొంగను చూసి భయపడకుండా నువ్వు ఎవరంటూ సూటిగా ప్రశ్నించింది , వెంటనే అక్కడి నుండి పారిపోదాం అనుకున్న ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేసింది.
భవాని వెంటపడి కొద్ది దూరం వెంబడించింది. భవాని ధైర్యాన్ని చూసి భయపడ్డ దొంగ, ఏమీ దొంగతనం చేయకుండానే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన చూసిన చుట్టుపక్కల కాలనీ ప్రజలు భవాని ధైర్యానికి ప్రశంసల జల్లు కురిపించారు. ఇంటివారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యం చూపించడం గొప్ప విషయమని, భవాని లాంటి పిల్లలు సమాజానికి స్ఫూర్తి అని అభిప్రాయపడ్డారు. భవాని చేసిన సాహసం ఇప్పుడు ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. ధైర్యానికి చిహ్నంగా నిలిచిన ఈ చిన్నారి చర్య సమాజానికి స్ఫూర్తిగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.