రాష్ట్రంలోని సింగరేణి గనుల్లో లభించిన సెగోడెన్ ఏనుగు దంత శిలాజాన్ని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం బిర్లా సైన్సు సెంటర్ కు అప్పగించారు. దీని ప్రదర్శన కోసం సెంటర్ లో ఏర్పాటు చేసిన ఫెవిలియన్ ను శనివారం బలరాం సెంటర్ చైర్మన్ నిర్మల బిర్లా తో కలసి ప్రారంభించారు. 2021 లో సింగరేణి శాస్త్రవేత్తలు మేడిపల్లి వద్ద దీనిని కనుగొన్నారని బలరాం అన్నారు. ముందు తరాల కు మన జీవజాలం గురించి తెలిసేలా దీనిని ఇక్కడ ప్రదర్శిస్తున్నామని చెప్పారు. దాదాపు 6 వేల సంవత్సరాల క్రితం నుంచి 11 లక్షల సంవత్సరాల క్రితం వరకు ఈ సెగోడెన్ ఏనుగులు మన రాష్ట్రంలో ఉండేవని ఇప్పుడు పూర్తిగా అంతరించాయని అన్నారు. బిర్లా సైన్సు సెంటర్ పురావస్తు శాఖ సంచాలకులు మృత్యుంజయ రెడ్డి మాట్లాడుతూ బిర్లా సైన్సు సెంటర్ లో విద్యార్థుల అవగాహన కోసం పలు ఏర్పాట్లు చేశామన్నారు. సెగోడెన్ ఏనుగుల కాలం నాటి వృక్షాల శిలాజలను కూడా ఇక్కడ ఉంచామన్నారు. డైనోసరియం ప్రదర్శన శాల ఆవరణలో నూతనంగా సింగరేణి సంస్థ అందించిన దంతాల శిలాజాన్ని విద్యార్థుల సందర్శనకు అనుమతిస్తామన్నారు.