న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ జడేజా మ్యాజిక్ చేశాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ.. బాల్‌తో విండీస్ ఆటగాళ్లకు హడలెత్తించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ మరోసారి తడబడింది. 21 పరుగుల వద్ద ఓపెనర్ క్యాంప్‌బెల్(10) సుదర్శన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత చంద్రపాల్, అథనాజ్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, 87 పరుగులు వద్ద చంద్రపాల్(34) రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కొంత సమయానికే 106 పరుగుల వద్ద కుల్దీప్ బౌలింగ్‌లో అథనాజ్(41) జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, ఆ వెంటనే కెప్టెన్ ఛేజ్(0) జడేజా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో 43 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజ్‌లో హోప్(31), ఇమ్లాచ్(14) ఉన్నారు.