అమరావతి: వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుడి కోసమే తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మేకల సుబ్బన్నను ఎందుకు తీసుకొచ్చారని సిఐని అడిగానని, ‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు.. మేము ఎవరినైనా తీసుకురావొచ్చు అని సిఐ ఘాటుగా నాకు సమాధానం చెప్పారు’ అని తెలియజేశారు. పోలీసు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని కక్షసాధింపు చేస్తే ప్రశ్నిస్తే తప్పేంటి? అని పేర్కొన్నారు. సిఐ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆత్మగౌరవాన్ని చంపుకుని బ్రతకలేమన్నారు. కృష్ణాజిల్లా ఎస్పి పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలని, పోలీస్ స్టేషన్ లో సిసి ఫూటేజీ చూసి మాట్లాడాలన్నారు. మాజీ మంత్రి పేర్నినానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పేర్ని నానితో పాటు మరో 29 మంది వైసిపి నేతలపై కేసు నమోదు చేశారు. ఆర్. పేట సిఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం టౌన్ పిఎస్ లో ఈ ఘటన జరిగింది.