హైదరాబాద్: నీళ్లు తరలించుకు పోతున్నా… సిఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టును పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 423 టిఎంసిల గోదావరి జలాలను ఎపి మళ్లిస్తోందని తెలియజేశారు. సిఎం గా ప్రజా ప్రయోజనాలు కాపాడతావా స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటావా? అని ప్రశ్నించారు. కేంద్రం లేఖపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. గోదావరి జలాలను ఎపి, మహారాష్ట్ర, కృష్ణా జలాలను కర్ణాటక, మహారాష్ట్రాలు తరలించుకపోతున్నాయని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి మొన్న ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్లినప్పుడు ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచడం గురించి సిద్ధరామయ్య, శివ కుమార్ దగ్గర మాట్లాడుతాడని అనుకున్నానని, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి మాట్లాడలేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుతుందనే బుద్ధి కనీసం రేవంత్ రెడ్డికి లేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఫోన్ కూడా చేయించలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒక్కటే పని కాదని, తెలంగాణ బాగోగుల గురించి కూడా పట్టించుకోవాలి అని హరీష్ రావు చురకలంటించారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు నల్లమల పిల్లి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.