న్యూఢిల్లీ: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ స్పష్టమైన అధిపత్యం కనబరిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ముఖ్యంగా యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయాడు. అతనితో పాటు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్. సాయి సుదర్శన్. నితీశ్ కుమార్, ధృవ్ జురేల్‌లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో భారత్ 518 పరుగుల భారీ స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 318 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ఆరంభమైన కొద్దిసేపటికే డబుల్ సెంచరీ చేస్తాడని భావించిన జైస్వాల్ (175) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 43 పరుగులు చేసి జేడన్ సీల్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్.. తన బ్యాటింగ్‌లో వేగం పెంచాడు. మరోవైపు ధృవ్ జురేల్ కెప్టెన్‌కు మంచి మద్దతు ఇచ్చాడు. వీరిద్దరు కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో గిల్ తన 10వ శతకాన్ని సాధించాడు. కెప్టెన్‌గా ఇది అతనికి ఐదో శతకం కావడం మరో విశేషం. అయితే 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధృవ్ జురేల్ ఔట్ కావడంతో 518/5 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ బౌలింగ్‌లో వారికన్ 3, చేజ్ 1 వికెట్ తీశారు.