ఖమ్మం: తనకు పోటీగా షాపు పెడతావా? చంపేస్తా అని బూతులు తిడుతూ ఓ రాజకీయ నాయకుడి అనుచరుడు వీరంగం సృష్టించాడు. ఖమ్మంలో రాజకీయ నాయకుడి అండదండలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రౌడీ అవతారమెత్తాడు. ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టాడని యజమానిని బూతులు తిడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ దాడికి దిగాడు. పాల్వంచ నుండి వచ్చి ఖమ్మంలో షాపు పెడుతావా? అని బండబూతులు తింటాడు. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామ పాఠశాలలో లక్ష్మణ్ అనే వ్యక్తి స్కూల్ అసిస్టెంట్‌గా పని చేయడంతో పాటు ఖమ్మంలో క్రాకర్స్ బిజినెస్ నిర్వహిస్తున్నాడు. తనకు ప్రముఖ రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, షాపు తొలగించకపోతే మనుషులను పంపించి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా ఎసిపికి ఫోన్ చేసి, బూతులు తిడుతూ షాపు తొలగించాలని డిమాండ్ చేశాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ, రౌడీలా వ్యవహరిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారస్థుల డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని కొందరు రౌడీల్లా ప్రవర్తించడం మంచిది కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లీ లీడర్లు ప్రజలకు సేవ చేయాలని కానీ సామాన్యులపై పెత్తనం చెలాయిస్తే ఎలా అని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తారని కొందరు వార్డు కౌనిలర్లు, సర్పంచ్ లు, వార్డు మెంబర్లను ఎన్నుకుంటే వాళ్లే ప్రజలపై పెత్తనం చెలాయించడంతో పాటు రౌడీయిజం చేస్తున్నారని నెటిజన్లు దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయాలని ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ప్రజలను హింసిస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.