దర్శక ధీరుడు రాజమౌళి శుక్రవారం తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రాజమౌళికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఒక స్పెషల్ ఫొటోతో దర్శకధీరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌మీడియాలో రాజమౌళితో దిగిన ఫొటోను పంచుకున్న మహేష్… “సినీ ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క దర్శకధీరుడు రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు తెరకెక్కించేవన్నీ అద్భుతాలే. మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే రానుంది”అని తెలిపారు.
ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు సైతం రాజమౌళికి తమదైన రీతిలో బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘ఎస్‌ఎస్‌ఎంబి29’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం టైటిల్‌పై ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారణాసి, జెన్ 63, మహరాజ్, గ్లోబ్ ట్రాటర్ అన్న టైటిల్స్ విశేషంగా వినిపిస్తున్నాయి.
అయితే నవంబర్ 16వ తేదీన అత్యంత భారీగా జరిగే ఓ వేడుకలో మహేష్‌తో రాజమౌళి తీస్తోన్న సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారట. అందుకోసం నిర్మాత డాక్టర్ కె.యల్. నారాయణ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రియాంక చోప్రా నాయికగా నటిస్తోన్న ఈ సినిమాను 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేస్తారనీ అంటున్నారు. అయితే ’బాహుబలి- ది ఎపిక్’ ను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు.