చండీగఢ్: హర్యానా సీనియర్ పోలీస్ అధికారి వై.పురాణ్ కపూర్ ఆత్మహత్య కేసును సత్వరంగా, నిష్పాక్షికంగా, సమగ్రంగా దర్యాప్తు చేయడానికి చండీగఢ్ పోలీసులు శుక్రవారం ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు చండీగఢ్ ఐజి పుష్పేంద్ర కుమార్ నాయకత్వం వహిస్తారు. ఇందులో చండీగఢ్ ఎస్‌ఎస్‌పి కన్వర్‌దీప్ కౌర్, డిఎస్‌పి చరణ్‌జిత్ సింగ్ విర్క్, ఎస్‌డిపివో(దక్షిణం) గుర్జిత్ కౌర్, సెక్టార్ 11 పోలీస్ స్టేషన్(పశ్చిమ) ఎస్‌హెచ్‌వో జైవీర్ రాణా కూడా సభ్యులుగా ఉంటారని అధికార ఉత్తర్వులో పేర్కొన్నారు. ‘సిట్ ఎఫ్‌ఐఆర్ నంబర్ 156/2025లోని అన్ని అంశాలను దర్యాప్తు చేస్తుంది, ఇందులో సాక్ష్యాల సేకరణ, సాక్షుల పరిశీలన, నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం, న్యాయ సలహా తీసుకోవడం మొదలయినవి ఉంటాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాత తుది నివేదికను తయారు చేస్తారు’ అని ఉత్తర్వు పేర్కొంది.