మన తెలంగాణ/హైదరాబాద్/సిటీబ్యూరో : పెం చిన ఆర్‌టిసి చార్జీలను వెంటనే తగ్గించాలని డి మాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ ‘చలో బస్ భవన్’ కార్యక్రమం చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ పోలీసుల వలయం దాటుకుని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు,తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ నేతలు గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్‌కు చేరుకున్నారు. అనంతరం టిజిఎస్‌ఆర్‌టిసి ఎండీ నాగిరెడ్డితో కెటిఆర్, హరీష్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని , పద్మారావు భేటీ అయ్యారు. గ్రే టర్ పరిధిలో పెంచిన ఆర్‌టిసి చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేర కు బిఆర్‌ఎస్ తరఫున వినతపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా ఆర్‌టిసి ఎండితో కెటిఆర్ మాట్లాడారు. ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడగగా, ‘మహాలక్ష్మి’పథకానికి సంబంధించిన రూ. 1353 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఎండీ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.9246 కోట్ల ఆర్‌టిసి గ్రాంట్‌ను విడుదల చేసినట్టు బిఆర్‌ఎస్ నేతలు తెలిపారు. ఆర్‌టిసి ఆస్తులను అమ్ముకోవాలని చూస్తూ, అంతిమంగా సంస్థను ప్రైవేట్‌పరం చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కెటిఆర్ తీవ్రంగా ఆరోపించారు. ఆర్‌టిసి ఎండీని కలిసిన అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపేలా టికెట్ల ధరలు పెంచడం అన్యాయం అని పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత బస్సును స్వాగతిస్తున్నామని, కానీ బస్సుల సంఖ్య పెంచాలని అన్నారు. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అని చెప్పి మగవాళ్ల నుంచి డబుల్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక చేత్తో ఫ్రీ ఇచ్చి మరో చేత్తో బస్ టికెట్ ధర పెంచడం దారుణం అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా చేయాలో తెలియదు అని, వారికి సర్కస్ నడపడమే తెలుసు అని విమర్శించారు. శాంతియుతంగా బయటకు వచ్చి బస్సు ఎక్కి ఆర్‌టిసి ఎండికి లేక ఇస్తామంటే అడ్డగోలుగా పోలీసులను దింపి అందర్నీ అరెస్టు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గాయని, ఈ నేపథ్యంలో మరోసారి టికెట్ల రూపంలో చార్జీలు పెంచి భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు సేవ కారణంగా నష్టం వస్తే, ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజలపై మోపకూడదని చెప్పారు. ప్రజా రవాణా అనేది ప్రభుత్వ సామాజిక బాధ్యత అని వ్యాఖ్యానించారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం ఆర్‌టిసి నష్టాల్లో ఉన్నా భరించిందని గుర్తు చేశారు. ఆర్‌టిసి లాభాల్లో ఉంటే బస్ ఛార్జీలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు.హైదరాబాద్ నగర ప్రజలపై పెంచిన భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా, ఆర్‌టిసి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సంస్థ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.
‘చలో బస్ భవన్’లో ఉద్రిక్తత, బిఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌పై నిరసన
ఆర్‌టిసి చార్జీల పెంపును నిరసిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ‘చలో బస్సు’ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో, ప్రభుత్వం ఆయనతో పాటు పార్టీ నేతలకు బస్సు భవన్ వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీంతో, కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్‌తో కలిసి సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్ (రెతీఫైల్) బస్ స్టాప్ నుంచి బస్సులో బస్సు భవన్ వరకు చేరుకున్నారు. బస్ భవన్‌కు బయలుదేరిన బిఆర్‌ఎస్ నేతలను పోలీసులు అక్కడికి పోలీసులు అడ్డుకుంటున్నారు. బస్ భవన్‌కు అర కిలో మీటర్ దూరంలో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, కార్యకర్తలు,
నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతోపాటు కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరికి, ప్రజాప్రతినిధులను మాత్రమే బస్సు భవన్‌లోకి అనుమతించారు. బిఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌లపై కెటిఆర్ స్పందిస్తూ, జాస్వామ్యబద్ధంగా బస్సులో కూర్చుని నిరసన తెలియజేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అర్థం లేని నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చార్జీల పెంపు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీ నేతలు అందరిని ఎక్కడికి అక్కడ అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలను అరెస్టు చేయడంపైన ఉన్న ఆసక్తి రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో పెరిగిపోతున్న క్రైమ్ రేటును తగ్గించడం పైన పెడితే మంచిదని పోలీసులకు ప్రభుత్వానికి హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చార్జీలను పెంచిందని వాటిని వెనక్కి తీసుకోవాలని బస్సులో వెళ్లి ఆర్‌టిసి ఎండికి లేఖ ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని కెటిఆర్ ప్రశ్నించారు
.
బిఆర్‌ఎస్ నేతలందరికీ బస్ టికెట్ కొనుగోలు చేసిన హరీష్‌రావు
బిఆర్‌ఎస్ భవన్ ఛలో బస్ భవన్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్‌రావు బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆర్‌టిసి బస్‌లో బస్ భవన్‌కు వెళ్లారు. మెహిదీపట్నంలో ఆయన సహచరులందరికీ స్వయంగా టికెట్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడి పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలతో సామాన్య ప్రజలకు కలిగే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బిఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌లపై హరీష్‌రావు స్పందిస్తూ, ఆర్‌టిసి టికెట్ ధరల పెంపుకు నిరసనగా బిఆర్‌ఎస్ పార్టీ చలో బస్ భవన్‌కు పిలుపునిస్తే మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం అని హరీష్‌రావు మండిపడ్డారు. ఇది అప్రజాస్వామీకం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. నాయకులను, కార్యకర్తల్ని ఎందుకు అరెస్టులు చేస్తున్నారు.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారని అన్నారు. భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారని, విద్యార్థులకు డబుల్ చేశారని పేర్కొన్నారు. ఆర్‌టిసి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్‌టిసి ధరలు తగ్గించేవరకు బిఆర్‌ఎస్ ప్రజా ఉద్యమం చేస్తుందని తెలిపారు.