నల్లగొండ జిల్లా, చిట్యాల తహశీల్దార్ కృష్ణనాయక్ ఎసిబి అధికారులకు చిక్కాడు. ఈ సంఘటనకు సంబందించిన వివరాలను మహబూబ్‌నగర్ ఎసిబి డిఎస్‌పి, నల్లగొండ రేంజ్ ఏసిబి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సిహెచ్ బాలకృష్ణ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 172, 167 లను మ్యుటేషన్ చేయటానికి ఇన్‌స్పెపెక్షన్ రిపోర్ట్ ఇవ్వటానికి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తితో తహశీల్దార్ 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకుని, దాంట్లో రూ.2 లక్షలు అడ్వాన్సుగా గురువారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో రమేష్ అనే ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా స్వీకరించారు. అదే క్రమంలో ఎసిబి అధికారులు నగదును స్వాధీనం చేసుకుని తహశీల్దార్ కృష్ణనాయక్‌తో పాటు రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నల్లగొండలోని తహశీల్దార్ నివాసంలో కూడా సోదాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు.