తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. గురువారం ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, 42 శాతం బిసి రిజర్వేషన్లతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల సంఘం స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరిస్తామని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడినట్లు అయ్యింది.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జిఓ 9 తీసుకొచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ జిఓను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఈ క్రమంలో నిన్న, ఇవాళ రెండు రోజులు.. పిటిషనర్ల తరుఫు న్యాయవాది, అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న హైకోర్టు 42 శాతం బిసి రిజర్వేషన్ల అమలు జిఓతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాలు, పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఆరు వారాలకు వాయిదా వేసింది.