హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై రెండో రోజు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బిసి కులగణనపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం తరువాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని, ఇంటింటికెళ్లి సర్వే చేశారని, సర్వే ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. బిసి జనభా 57.6 శాతం ఉన్నారనడంలో ఎవరూ కాదనడం లేదన్నారు. 57.6 శాతం జనాభా ఉన్నా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎజి తెలియజేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని, రాజకీయ వెనుకబాటుతనం ఉందని అసెంబ్లీ గుర్తించి తీర్మానం చేసిందని, గ్రామీణ, పట్టణ సంస్థల్లో బిసిలకు 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయం తీసుకుందని వివరించారు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టేనని, ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదన్నారు. గడువులోగా గవర్నర్ ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని, తమిళనాడు ప్రభుత్వం, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నోటిఫై చేయనక్కర్లేదని, అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందని ఎజి స్పష్టం చేశారు.