హైదరాబాద్: గాంధీభవన్ లో లీగల్ టీమ్ అందుబాటులో ఉండాలని మంత్రులకు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇన్ చార్జ్ మంత్రులు జిల్లాల నాయకులతో మాట్లాడాలని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులను ఖరారు చేసి బిఫారం ఇవ్వాలని, నో డ్యూ పత్రాలు ఇప్పించాలని, గాంధీ భవన్ లో సమన్వయం కోసం ఒక బృందం ఉండాలని అన్నారు. హైకోర్టు లో బిసి రిజర్వేషన్ల కేసుపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యవేక్షించాలని ఆదేశించారు. కోర్టు తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణపై రాత్రి మరో సమావేశం జరుగుతుందని, తొలివిడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియపై అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళ్తున్నామని సిఎం పేర్కొన్నారు.
రిజర్వేషన్ల దామాషా ప్రకారం ఇన్ ఛార్జ్ మంత్రులు.. ముఖ్యనేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలని, నామినేషన్ల ప్రక్రియకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించాలని, నామినేషన్ల దరఖాస్తు నమూనా పత్రం క్షేత్రస్థాయికి పంపాలని సూచించారు. సమన్వయ కమిటీ, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటిలో ఉండేలా చూడాలని సలహా ఇచ్చారు. ఎంపిపిలు, జడ్పి చైర్మన్ పదవుల ఎంపికపై పిసిసి నిర్ణయిస్తుందని, పిసిసి నిర్ణయించే వరకు రాజకీయ ప్రకటనలు చేయొద్దు అని హెచ్చరించారు. బిసి రిజర్వేసన్లపై హైకోర్టులో వాదనలను పర్యవేక్షించాలని రేవంత్ రెడ్డి కోరారు.