హైదరాబాద్: శాంతియుతంగా ఆర్టిసి ఎండికి వినతి పత్రం ఇవ్వాలని బిఆర్ఎస్ పిలుపునిచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తనతో పాటు బిఆర్ఎస్ నేతల గృహనిర్భందంపై మండిపడ్డారు. చలో బస్ భవన్ పిలుపు దృష్ట్యా బిఆర్ఎస్ నేతలను గృహనిర్బంధం చేశారు. బిఆర్ఎస్ నేతలు కెటిఆర్, మాజీమంత్రి హరీష్ రావు, మాజీ మంత్రుల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..బస్సు ఛార్జీల పెంపు వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నామని, ఆర్టిసి బస్సులు ఎక్కి వెళ్తామంటే భారీగా పోలీసులను మోహరించారని తెలియజేశారు. ఒకవ్యక్తి బస్సు ఎక్కకుండా ఆపడానికి పోలీస్ బలగాలను పంపారని, ఈ ఉత్సాహం హైదరాబాద్ లో నేరాల అదుపులో చూపిస్తే మంచిదని విమర్శించారు. బస్సు ఛార్జీలు వెనక్కి తీసుకునే వరకు నిరసన తెలుపుతూనే ఉంటామని, పోలీసు నిర్భంధాలు తమకు, పార్టీకి కొత్త కాదని కెటిఆర్ హెచ్చరించారు.