హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన “చలో బస్ భవన్” కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మేడ్చల్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తదితర బిఆర్ఎస్ నేతల నివాసాల వద్ద పోలీసులు చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శంబీపూర్ రాజు స్పందించారు. శాంతియుతంగా జరగాల్సిన ప్రజా కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం ఉల్లంఘించిందని శంబీపూర్ రాజు తీవ్రంగా మండిపడ్డారు. పెంచిన చార్జీలపై ప్రజలకు జవాబు చెప్పలేని ప్రభుత్వమే ఈ విధమైన అణచివేత చర్యలకు దిగుతోందని వారు విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన ఛలో బస్ భవన్ కార్యక్రమం ప్రజల వాణిని వినిపించేందుకు, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన ఉద్యమం అని తెలియజేశారు. పోలీసులు చేసిన హౌస్ అరెస్ట్‌తో తాము వెనక్కి తగ్గబోమని, ప్రజా హక్కుల కోసం బిఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలపై పోరాడుతున్న తమను హౌస్ అరెస్టు చేయడం భావ్యం కాదని మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు పాలకులకు మంచిది కాదని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన ఆర్ టిసి సౌకర్యాలను అందించే బదులు రేట్లు పెంచడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెంచిన ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.