వరంగల్‌లోని మా కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాలగోపాల్ స్మారకోపన్యాసం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. భారతీయ సామాజిక, సాంసృ్కతిక, రాజకీయ చరిత్రలో కాకతీయవర్శిటీ, వరంగల్ కీలక స్థానాన్ని పొందాయి. ప్రగతిశీల, ఉదారవాద సాహిత్య సంప్రదాయం, గొప్ప కవిత్వానికి మానవ హక్కుల పరిరక్షణ చరిత్రకు వరంగల్ ప్రసిద్ధి చెందింది. తన కవిత్వాన్ని రాజుకు అంకితం ఇవ్వడానికి నిరాకరించిన బమ్మెర పోతన, అన్యాయాన్ని సవాల్ చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు, ప్రజల పౌరస్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన బాలగోపాల్ హక్కులకోసం పోరాడినవారే. బాలగోపాల్ ఒక ఆదర్శప్రాయుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, పండితుడు, పౌరన్యాయవాది అంతకన్నా స్నేహపూర్వక మనిషి. నెల్సన్ మండేలా ఆదర్శవంతుడైన మానవుడిని అంచనా వేస్తూ, నిజాయితీ, సరళత, వినయం, దాతృత్వం, గర్వం లేకపోవడం, తోటివారికి సేవ చేయాలన్న సంకల్పం అవి ఒకరి ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు అంటాడు. ఆ లక్షణాలన్నీ బాలగోపాల్‌లో మూర్తీభవించాయి. శిక్షణ ద్వారా గణిత శాస్త్రజ్ఞుడు. వృత్తిరీత్యా న్యాయవాది. అంతకంటే, తెలంగాణ ప్రజల జీవన వాస్తవాలతో మమేకమైన ప్రజా మేధావి.
భారత పౌర స్వేచ్ఛా ఉద్యమానికి 200 ఏళ్ల గొప్ప చరిత్ర ఉంది. రౌలత్ సత్యాగ్రహం, ఎస్. సత్యమూర్తి రాసిన పౌరహక్కుల గ్రంథం వలస పాలనలో పౌర స్వేచ్ఛా ఉద్యమ చరిత్రలో మైలురాళ్లు. 1936 ఆగస్టు 24న ఇండియన్ సివిల్ లిబర్డీస్ యూనియన్ (ఐసిఎల్‌యు)ను జవహర్ లాల్ నెహ్రూ అధికారికంగా ప్రారంభించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గౌరవ అధ్యక్షులుగా, సరోజని నాయుడు అధ్యక్షులుగా కెబి మీనన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పౌర హక్కుల ఉల్లంఘన, ఖైదీలు, ముఖ్యంగా రాజకీయ ఖైదీల స్థితిగతుల సమాచారం సేకరించడం, పత్రికా స్వేచ్ఛను కాపాడడం, పోలీసు జులుం నిరోధించడం ఐసిఎల్‌యు లక్ష్యాలు. స్వతంత్ర భారతదేశంలో పౌర స్వేచ్ఛా ఉద్యమం 1970వ దశకంలో ముఖ్యంగా 1975 ఎమర్జెన్సీ తర్వాత ఊపు అందుకుంది. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల కమిటీ ( ఎపిసిఎల్‌సి) 1960వ దశకం చివరిలో స్థాపించబడినా, 1980లో బాలగోపాల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించింది. ఎపిసిఎల్‌సి తర్వాత మానవ హక్కుల వేదికకు చెందిన నిజనిర్ధారణ కమిటీలు ఆంధ్రప్రదేశ్‌లో బాలగోపాల్ మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకునేలా చేశాయి.
పౌరస్వేచ్ఛా ఉద్యమంలో బాలగోపాల్ చేసిన కృషి, ఆయన నాయకత్వం రాజ్యాంగబద్ధత అనేది కోర్టు గదులకో, పాఠ్యపుస్తకాలో పరిమితం కాదని తేటతెల్లం చేసింది. రాజ్యాంగబద్ధత అసలు స్వరూపం పోలీసు స్టేషన్లు, ట్రయల్ కోర్టులు, జైలు గదుల్లో స్పష్టం కాగలదని తెలిపింది. ఎమర్జెన్సీ తర్వాత భారత సుప్రీం కోర్టు చేపట్టిన న్యాయపరమైన కార్యకలాపాలు పరిశోధనాత్మక జర్నలిజం, మానవ హక్కులు, మహిళా హక్కుల కార్యకలాపాలు వరంగల్‌లోని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చాయి. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం అనే ప్రాథమిక హక్కుల పరిరక్షణ, స్వేచ్ఛా ఉద్యమానికి కీలకం అయ్యాయి. రాష్ట్రంలో ఈ ఉద్యమం ముందుకు నడపడంలో కెజి కన్నబిరాన్, పత్తిపాటి వెంకశ్వర్లు, హరగోపాల్, బాలగోపాల్ కీలక పాత్ర పోషించారు. బాలగోపాల్… తరచు రాజ్యాంగం అంటే ఏమిటి. అది అరెస్ట్ అయినవారు, నిర్బంధించబడిన వారు, నిందితులు, జైలుశిక్ష అనుభవిస్తున్న వారికి, వారి అనుభవంలో జీవిస్తుందా. కోర్టు తీర్పులు, ప్రసంగాలకే పరిమితమవుతుందా అని అని ప్రశ్నించేవారు.
క్రిమినల్ జస్టిస్ రాజ్యాంగబద్ధీకరణ
1950 నాటి రాజ్యాంగం ఆర్టికల్ 14, 19, 20, 21, 22, 39ఎ క్రిమినల్ ప్రొసీజర్ రక్షణ ప్రధానాంశాలుగా ఉన్నాయి. రాజ్యాంగ చట్టం అనేది ఆ అధికరణాల ఆధారంగా నిర్మించిన కేసుల చట్టం. 1950లో ఎకె గోపాలన్ కేసు నుంచి 2017లో పుట్టస్వామి కేసు వరకూ వచ్చిన తీర్పులు రాజ్యాంగ సజీవ స్వరూపాన్ని మనకు తేటతెల్లం చేస్తున్నాయి. బాలగోపాల్ నిబద్ధత, దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వానికి పౌరులకు మధ్య ఘర్షణలకు అరెస్టులు, నిర్బంధం, కస్టడీ హింస మొత్తం ప్రక్రియ అద్దం పడుతుంది. అరెస్టు దర్యాప్తు సమయంలో సంక్షిప్త శిక్షలు విధించడం పోలీసు వ్యవస్థ మరింత యాక్టివేట్ చేస్తోంది. నేరాల రూపంలో జరిగే వ్యక్తిగత క్రిమినల్ చట్టం, క్రిమినల్ న్యాయ వ్యవస్థ శాంతి భద్రతలకు, నేర నియంత్రణకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.
క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్‌లో పౌరులతో సంబంధాలు కలిగిన మొదటి ఏజెన్సీ పోలీసులు. పోలీసుల విధులు నియంత్రణాత్మకమైనవి. పోలీసు వ్యవస్థ ప్రజల జీవితం, స్వేచ్ఛలో జోక్యం చేసుకుంటుందనే ముద్రపడింది. పోలీసు కస్టడీ నేర న్యాయ ప్రక్రియలో కీలకంగా పని చేస్తుంది. అరెస్టు అంటే స్వేచ్ఛను కోల్పోవడమే. ఆపై పోలీసు దర్యాప్తు పద్ధతి, నిర్బంధం, వైద్య పరీక్షలు, డిఎన్‌ఎల నమూనా సేకరణ వంటివి భయంకరమైన అనుభవాలే. అంతకంటే దారుణం నిందితులను ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వికలాంగులు, మానసికంగా బాగోలేని ఖైదీల పట్ల ప్రవర్తన దారుణం. బాలగోపాల్ కోర్టులను, రాజ్యాంగాన్ని ప్రజల సాధికారతకు ఓ వేదికగా ఉపయోగించుకున్నాడు. ఆ ప్రక్రియలో క్రిమినల్ జస్టిస్‌ను ఎదుర్కొనేందుకు కొత్త సాధనాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాడు. ఆంధ్రప్రదేశ్ పౌర స్వేచ్ఛ కమిటీతో బాలగోపాల్ దీర్ఘకాల అనుబంధం అక్కడే కీలకంగా మారుతుంది. పోలీసు ఎన్‌కౌంటర్‌లు, కస్టడీ హింసను ఎపిసిఎల్‌సి జాగ్రత్తగా నమోదు చేస్తూ, ప్రజలకు జవాబుదారీ ఉండాలని కోరుతోంది.
1978 మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుతో సిద్ధాంతపరమైన పురోగతి వచ్చింది. కోర్టు చట్టం ప్రకారం అనుసరించే విధానం న్యాయంగా, సహేతుకంగా ఉండాలని నిర్ధారిస్తూ, పోలీసు అధికారాన్ని స్క్రూటినీ చేసేందుకు కోర్టులకు వీలు కల్పించింది. చట్టం అరెస్ట్, నిర్బంధాన్ని రాజ్యాంగబద్ధం చేస్తుంది. కానీ సెక్షన్ 41ఎ ను తరచు విస్మరిస్తారు. అరెస్టు, దర్యాప్తులో డిఫాల్ట్ సాధనంగా మిగిలిపోతుంది. న్యాయాధికారులు గుడ్డిగా రిమాండ్ ఇచ్చేస్తారు. దీంతో అక్రమ నిర్బంధాన్ని అడ్డుకోడం జరగదు.
ఖైదీల హక్కులు, గౌరవం పెంపు, సంస్కరణ లేమి
1980ల ప్రారంభంలో ఖైదీల హక్కుల విషయంలో ఓ చైతన్యం వచ్చింది. సునిల్ బత్రా (ఓ కేసులో) ఖైదీలు ప్రాథమిక హక్కులను నిలుపుకోవాలని పట్టుబడుతూ, ఏకాంత నిర్బంధం, బార్ ఫైటర్‌లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. షీలా బార్సే (1983) కస్టడీలో ఉన్న మహిళలు, పిల్లలను రక్షించారు. శత్రుఘన్ చౌహాన్ (2014) క్షమాభిక్ష పిటిషన్లలో జాప్యాన్ని శిక్ష తగ్గింపునకు ఓ కారణంగా గుర్తించారు. దోషులకు గౌరవం ఉంటుందని గుర్తించాలని కోరారు. అయినా, జైళ్లు కిక్కిరిసి ఉన్నాయి. వారిలో మూడింట రెండు వంతుల మంది విచారణలో ఉన్న ఖైదీలు, పెరోల్, ఫర్లోలను రాజ్యాంగ హక్కుగా కాకుండా జైలు అధికారుల విచక్షణ అధికారంగా పరిగణిస్తారు. ఇక ఓపెన్ జైళ్లు ప్రయోగశాలలే. ఇక పోలీసు సంస్కరణలు నామమాత్రమే, పోలీసింగ్ రాజ్యాంగ సంస్కరణలకు ప్రతిఘటనే ఎక్కువ.
పోలీసు బలగాలను జవాబుదారీ చేయడం ఓ కలగానే నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ పౌర స్వేచ్ఛ కమిటీ, వంటి సంఘాలు బాధితుల కుటుంబాలు, ఖైదీలకు ఇటువంటి మెజిస్టీరియల్ విచారణ సమయంలో చట్టపరమైన ప్రాతినిధ్యం ఉండాలని పదే పదే ఒత్తిడి చేస్తున్నాయి. 1980ల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్ని కస్టోడియల్ మరణాలను ఎపిసిఎల్‌సి నమోదు చేసి దర్యాప్తు చేసింది. మెజిస్టీరియల్ విచారణ సమయంలో మృతుల కుటుంబాలకు ఉచిన న్యాయ సలహా అందించింది. భారతదేశంలో పౌర స్వేచ్ఛా సంఘాల ప్రయత్నాల వల్ల ఈ పరిమిత చట్టపరమైన ప్రాతినిధ్యం సాధ్యమైంది. కస్టోడియల్ న్యాయం అభివృద్ధికి బాలగోపాల్ అపార కృషి చేసిన మరో రంగం ఇది. బాలగోపాల్ తన తోటి పౌరులను అర్థం చేసుకుంటూ పౌర న్యాయవాదిగా తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. ఆయనకు నిజమైన నివాళి జ్ఞాపకాలలో కాదు, కష్టమైన ప్రశ్నలు సంధించడమే. రాజ్యాంగం చట్టం, నివేదికలలో కాకుండా ప్రజల జీవితాలలో ఉండాలని డిమాండ్ చేయడమే.
ప్రొ. శ్రీకృష్ణదేవరావు
(వైస్ చాన్సలర్ నల్సార్ వర్శిటీ)