మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో సమసిపోయింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం ఉదయం మంత్రులు ఇద్దరితో సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశానికి ముందు తన వ్యాఖ్యల పట్ల వి చారం వ్యక్తం చేస్తోన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అయితే క్షమాపణకు తప్ప దేనికి అంగీకరించేది లేదని మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ పట్టుబట్టారు. దీంతో తన వద్ద జరిగే సమావేశానికి వస్తే క్షమాపణ చెప్పిస్తానని మహేశ్‌కుమార్ గౌడ్ హామీ ఇచ్చిన తర్వాతనే అడ్లూరి లక్ష్మణ్ ఈ సమావేశానికి వెళ్లినట్టు పార్టీ వ ర్గాల సమాచారం. పై ఇద్దరు మంత్రులతో మహేశ్‌కుమార్ గౌడ్ ఇంట్లో జరిగిన స మావేశానికి వీరిద్దరి తరఫున పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ‘నేను అనని మాటలను మీడియా వక్రీకరించడం వల్ల అడ్లూరి బాధపడ్డారని తెలిసింది.
ఒక బీసీ నాయకునిగా ఏ వర్గం పట్ల తనకు చులకన భావం లేదు. తనది అలాంటి మనస్థత్వం కూడా కాదు. మేమంతా ఒకే కుటుంబం. పార్టీలో మొదటి నుంచి అన్నదమ్ముల్లా కలిసిపని చేసాం. ఇక ముందు కూడా అదేమాదిరిగా కలిసి ఉంటాం, కలిసి పనిచేస్తాం. తన వ్యాఖ్యలు ఒకవేళ బాధకలిగిస్తే అందుకు వ్యక్తిగతంగా నేను అడ్లూరికి క్షమాపణ చెబుతున్నాను’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పై కొచ్చిన నేతలని మహేశ్‌కుమార్ అన్నారు. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. మంత్రులు ఎక్కడ మాట్లాడినా కూడా బాధ్యతాయయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ హితవు పలికారు.
పార్టీ లైన్ దాటను : మంత్రి అడ్లూరి
పొన్నం ప్రభాకర్ తనను క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. పొన్నం ప్రభాకర్‌ను గౌరవిస్తా&కానీ ఆయన వ్యాఖ్యల పట్ల మాదిగ జాతి బాధపడిందన్నారు. అట్టడుగు వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పార్టీ జెండా మోసిన తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిందని, పార్టీ ఆదేశాలు శిరోధార్యం. పార్టీ లైన్ దాటే వ్యక్తిని కానని, పార్టీ ఆదేశాల మేరకు తమ మధ్య తలెత్తిన వివాదం ఇంతటితో సమసిపోయిందని ఆడ్లూరి పేర్కొన్నారు. మంత్రుల మధ్య రాజీ కుదిర్చిన ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఏఐసిసి నాయకులు సంపత్‌కుమార్, ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ ఠాకూర్, ఎర్రవతి అనిల్, శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.