మన తెలంగాణ/ఎల్లారెడ్డి/మెదక్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి, మెదక్ జి ల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం ఆయా జిల్లాల్లో పర్యటించింది. కామారెడ్డిఎల్లారెడ్డి ప్రధాన ర హదారిలో తెగిపోయిన అడవి లింగాల మూలమలకు బ్రిడ్జి రోడ్డు, పోచంపల్లి గ్రామ శివారులోని వడ్డే గుడిసెల వద్ద తెగిపోయిన రహదారిని బృందం సభ్యులు పరిశీలించారు. 42 రోజుల క్రితం వచ్చిన వరదల వల్ల స్థానిక పెద్ద చెరువు వద్ద పంట పొలాల్లో ఇసుకమేటలను తిలకించారు.
పంట నష్టం వివరాలను సంబంధిత అధికారులు, కలెక్టర్ నుంచి సేకరించారు. వరదల వల్ల కలిగిన నష్టాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రహదారి వెంట పర్యటిస్తూ నష్టపోయిన పంటలను తిలకించారు. కేంద్ర బృందం సభ్యుల వెంట జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఆర్‌డిఓ పార్థసింహారెడ్డి, ఇరిగేషన్ ఇడి వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో డిఇ విజయ సారథి, సిఐ రాజిరెడ్డి, ఎస్‌ఐ బొజ్జ మహేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.గత ఆగస్టులో మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు, రోడ్లు తదితర వాటి పరిస్థితిపై కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ కెపొన్నుస్వామి, వినోద్ కుమార్, అభిషేక్ కుమార్, యస్. యస్. పింటు పర్యటించారు.
తెగిపోయిన కట్టలు, వంతెనలు, నేలమట్టమైన పంటలు, పలు గ్రామాల్లో కూలిన ఇళ్లను పరిశీలించారు. పంట నష్టం బాధితులు తమను ఆడుకోవాలని కేంద్ర బృందాన్ని కోరారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాలోని మెదక్, హవేళి ఘనపూర్, రామాయంపేట, నిజాంపేట, పాపన్నపేట మండలాల పరిధిలో పలు గ్రామాల్లో జరిగిన నష్టాలను కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం అధిక వర్షం కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడంతోపాటు తెగిన వంతెనలు, కాలువలు, దెబ్బతిన్న రోడ్లు రహదారులు, పంచాయతీరాజ్ బ్రిడ్జిలు, జరిగిన పంటనష్టంపై పూర్తి స్థాయిలో కేంద్ర బృందానికి వివరాలు వెల్లడించారు. విపత్తు జరిగిన సమయంలో తీసిన ఫొటోలను కలెక్టరేట్ హాలులో ఎగ్జిబిషన్ నిర్వహించి చూపారు. ఈ సందర్బంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితుల వల్ల వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి వివరిస్తామని కేంద్ర బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్‌డిఒ రమాదేవితో పాటు ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బిఅధికారులు తదితరులు పాల్గొన్నారు.