మాక్‌కే: ఆస్ట్రేలియా అండర్19 టీమ్‌తో జరిగిన రెండో యూత్ టెస్ట్‌లో భారత యువ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 20తో క్లీన్ స్వీప్ చేసింది. భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను రెండు ఇన్నింగ్స్‌లలో కూడా తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ కూడా ఎక్కువ స్కోరు సాధించలేక పోయింది. 171 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో బార్టన్ నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియా ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. చార్లెస్, విల్, జూలియన్‌లు తలో రెండేసి వికెట్లను పడగొట్టి తమవంతు పాత్ర పోషించారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ (38) ఒక్కడే కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. భారత బౌలర్లలో హెనిల్ పటేల్, నామన్ పుష్పక్ మూడేసి వికెట్లను తీశారు. ఇక ఆస్ట్రేలియా ఉంచిన 84 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వేదాంత్ త్రివేది 33 (నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, తొలి టెస్టులో భారత యువ జట్టు ఇన్నింగ్స్ తేడాతో జయకేతనం ఎగుర వేసింది.