స్టాక్‌హోమ్ : రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ ( లోహ సేంద్రియ చట్రాల) అభివృద్ధి చేసినందుకు గాను జపాన్ లోని క్యోటో విశ్వవిద్యాలయానికి చెందిన సుసుము కిటాగవా, ఆస్ట్రేలియా లోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ రాబ్సన్, అమెరికా లోని బర్కిలీ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒమర్ ఎం యాఘీలకు సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందించనున్నట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వీరు కొత్తరకం మాలిక్యులర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్టు తెలిపింది.లోహ అయాన్‌లను సేంద్రీయ అణువులతో అనుసంధానించడం ద్వారా తయారైన స్ఫటికాకార పదార్ధాలు ఈ పరిశోధనలో ప్రత్యేకత. ఇవి అధిక పోరస్ నిర్మాణాలను ఏర్పరుస్తాయి.
ఈ నానోస్కోపిక్ చట్రాలు వాయువులు, అణువులను బంధించగలవు. నిల్వ చేయగలవు. మార్చగలవు. ఇవి ప్రపంచ స్థిరత్వ సవాళ్లను ఎదుర్కోవడంలో అపారమైన సామర్థాన్ని అందిస్తాయి. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ (ఎంఒఎఫ్ ) కార్బన్‌డైయాక్సైడ్, మిథేన్ లేదా నీటి ఆవిరి వంటి వాయువులను వాటి చిన్న కుహరాల ద్వారా లోపలికి, బయటకు ప్రవహించేలా చేస్తాయి. ఈ ప్రత్యేక లక్షణం గ్రీన్‌హౌస్ వాయువులను సంగ్రహించడం , నీటిని శుద్ధి చేయడం, హైడ్రొజన్ ఇంధనాన్ని నిల్వచేయడం వరకు అద్భుతమైన విధులను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. శాస్త్రవేత్తలు ఈ పదార్థాలను ప్రయోజన నిర్మిత గదులతో కూడిన పరమాణు నిర్మాణంగా అభివర్ణిస్తారు.
ఎంఒఎఫ్‌లు అంటే ఏమిటి?
మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ అనేవి లోహ అయాన్లు, ఆర్గానిక్ లింకర్లు కలిపి ఏర్పడే అణు నిర్మాణాలు. ఇవి పొడవైన గుహలు కలిగి ఉంటాయి. అందువల్ల వాటిలో నీటి ఆవిరి నుండి నీరు సేకరించడం , కార్బన్‌డయాక్సైడ్ శోషణ , హైడ్రొజన్ నిల్వ విషపూరిత వాయువుల నిర్వహణ వంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి.
సామాజిక ప్రభావం
ఈ నిర్మాణాలు పర్యావరణ పరిరక్షణ, శుద్ధ నీటి సేకరణ, ఫలాల పరిపక్వత నియంత్రణ, ఔషధాల సరఫరా వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీశాయి. ఎంఒఎఫ్‌ల ద్వారా పిఎఫ్‌ఎఎస్ వంటి హానికర రసాయనాలను నీటిలో నుండి వేరు చేయడం సాధ్యమైంది.
ఇప్పటివరకు 116 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రకటన
గతేడాది ముగ్గురికి ఈ అవార్డు దక్కింది. ప్రొటీన్లపై విశేష పరిశోధనలు చేసిన డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్‌లు ఈ పురస్కారం అందుకున్నారు. మొత్తంగా 19012024 మధ్యకాలంలో 116 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్‌ను ప్రకటించగా, ఇప్పటివరకు 195 మంది దీనిని అందుకున్నారు. వీరిలో జాన్‌బీ గూడ్‌ఎనఫ్ 97 ఏళ్ల వయసులో కెమిస్ట్రీలో పురస్కారం అందుకున్న వృద్ధుడిగా నిలువగా, ఫ్రెడెరిక్ జొలియట్ 35 ఏళ్ల వయసులో నోబెల్ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా నిలిచారు. ఇక ఫ్రెడరిక్ సాంగెర్, బ్యారీ షార్ప్‌లెస్‌లు రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్ అందుకోవడం విశేషం.
సోమవారం (అక్టోబర్ 6) మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. తొలుత వైద్యశాస్త్రంలో, మంగళవారం భౌతిక శాస్త్రంలో విజేతలను ప్రకటించగా, బుధవారం రసాయనశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లు వెల్లడించారు. గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్న వారి పేర్లను ప్రకటిస్తారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు.