న్యూయార్క్ : దివ్వెల పండుగ దీపావళికి అమెరికాలోని కాలిఫోర్నియా కూడా అధికారికంగా గుర్తించింది. ఈ రోజున అధికారిక సెలవుదినంగా ప్రకటించింది. ఈ నెలలోనే దీపావళి ఉంది. కాలిఫోర్నియాలోని చట్టసభలు రెండింటిలోనూ దీపావళికి అధికారిక సెలవు బిల్లును సభ్యులు ఇంతకు ముందే ఆమోదించారు. దీనితో ఇప్పుడు తాము దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయంపై సంతకం చేసినట్లు గవర్నర్ గవిన్ న్యూసమ్ తమ ప్రకటనలో తెలిపారు. కాలిఫోర్నియాలో భారతీయ సంతతి ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. భారతీయులతో పాటు కాలిఫోర్నియన్లు అంతా కూడా సంతోషంగా దీపావళిని నిర్వహించుకునేందుకు ఈ రోజును సెలవుగా ప్రకటించడం జరిగిందని, ఇది సంతోషకరమైన నిర్ణయం అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమెరికాలో పెన్సిల్వేనియా, తరువాత కనెక్టికట్ , న్యూయార్క్ నగరం దీపావళిని సెలవుల జాబితాలో చేర్చింది. పలు నగరాలలో భారతీయ పండుగల సంస్కృతి సంబరాల సందడి వ్యక్తం చేసుకునేందుకు ఈ క్రమంలో అవకాశం ఏర్పడిందని అమెరికాలో ఉంటున్న భారతీయులు ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ సంతతికి ప్రాతినిధ్యం వహించే ఇండియాస్పోరా సంస్థ వ్యవస్థాపకులు, ఛైర్మన్ ఎంఆర్ రంగస్వామి కాలిఫోర్నియా విజయం, ప్రగతికి తమ వంతు పాటుపడుతూ వస్తున్న భారతీయ అమెరికన్ల తరాలకు ఈ విషయం చారిత్రక సంతోషకర ఘట్టం అని వ్యాఖ్యానించారు.