న్యూఢిల్లీ: ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో పాక్ సైనికులు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో నిఘా వర్గాలు నిర్వహించిన ఆపరేషన్‌లో నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కి చెందిన ఉగ్రవాదులు, సైనికులు మరణించారని పాక్ సైన్యం వెల్లడించింది.
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఒరాక్జాయ్ జిల్లాలో అక్టోబర్ 7-8 రాత్రి టిటిపికి చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు.. లెఫ్టినెంట్ కల్నల్, మేజర్‌తో సహా 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని సైనిక ప్రకటన తెలిపింది. ఘటనా ప్రాంతంలో మిగతా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొంది.